నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది.. ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్‌లో వచ్చిన నష్టాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల వివరాల మేరకు.. నల్గొండ మండలం పెద్దసూరారం గ్రామానికి చెందిన సోదరులు మార్త శ్రీకాంత్ , వెంకన్న నల్గొండ పట్టణంలో ఉంటున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లయి.. పిల్లలు కూడా ఉన్నారు. అయితే శ్రీకాంత్ ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్నాడు.
మరోవైపు వెంకన్నతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇద్దరూ కలసి రూ.3 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి నష్టపోయారు. దీంతో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. శ్రీకాంత్ తన ఇల్లు అమ్మి రూ.60 లక్షల వరకు అప్పులు చెల్లించాడు. అయినా అప్పులు తీరకపోవడం, ఒత్తిళ్లు అధికం కావడంతో శ్రీకాంత్ నెల కింద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. అయినా అప్పులోళ్ల ఒత్తిళ్లు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర మనోవేదనకు గురై.. సోమవారం రాత్రి శ్రీకాంత్ అద్దె ఇంట్లో చెరో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవర్మణానికి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఇంటి యజమాని ఏదో అవసరమొచ్చి వారిని పిలవగా ఏ స్పందన లేదు.. దీంతో అనుమానం వచ్చి కిటికిలోనుంచి చూడగా ఇద్దరూ విగత జీవులై ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శ్రీకాంత్‌కు భార్య, కుమారుడు, కుతూరు ఉండగా.. వెంకన్నకు కూడా భార్య, కూతురు, కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు.