సెలవు రోజు సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం విషాదంలో మునిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పింది. ఆయన మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. చిన్నారులిద్దరూ ప్రాణాలతో బయటపడిన సంఘటన వరదయ్యపాళెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. తాగిన మైకంలో నడి రోడ్డుపై పడిపోయిన కుమారుడిని తండ్రి పక్కకు లాగుతుండగా కారు ఢీ కొనడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శ్రీరంగరాజపురం మండలంలో జరిగింది.
సరదా కోసం ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రానికి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వరదయ్యపాళెం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సత్యవేడు మండలం చిగురుపాళెం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సెలవులకు తన స్వగ్రామమైన చిగురుపాళెంకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఉదయం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం సందర్శనకు వెళ్లారు. అక్కడ జలపాతాల వద్ద సరదాగా గడిపారు.
మధ్యాహ్నం ప్రభాకర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనే కారు నడుపుతూ తిరుగు పయనమయ్యారు. దరఖాస్తు గ్రామం వద్ద ప్రభాకర్ రెడ్డి గుండపోటుకు గురవడంతో, కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభాకర్ రెడ్డి అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య రజితకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో బాధితులను సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రభాకర్ రెడ్డి మార్గమధ్యంలోనే మృతి చెందారు. భార్య రజిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరు పిల్లలు బోరున విలపించడం స్థానికులను కలచివేసింది. ఎస్ఐ పురుషోత్తం రెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.