ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

దైవదర్శనానికి వెళ్లొస్తున్న ఓ కుటుంబానికి మార్గమధ్యలో అనుకోని ఆపద ఎదురైంది. ఆపి ఉన్న డీసీఎంను బైక్‌ను ఢీకొనడంతో తండ్రీకుమారుడు మృత్యువాతపడగా, తల్లీ కొడుకు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన డాకోజీ రామకృష్ణది రెక్కాడితేగాని డొక్కాడని బీదకుటుంబం. లక్కారం స్టేజీ వద్ద చిన్న హేర్‌ సెలూన్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మణిచరణ్‌ పెద్ద అంబర్‌పేటలో 8వ తరగతి చదువుతున్నాడు. చిన్న కొడుకు ఈశ్వర్‌సాయి. ఇతడి మానసిక స్థితి సరిగా లేదు. ఇంటి వద్దే ఉంటున్నాడు.

రామకృష్ణ అయ్యప్ప భక్తుడు. 18ఏళ్లుగా అయ్యప్ప దీక్ష చేపడుతున్నాడు. చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి అన్నా కూడా ఎనలేని భక్తి. ఈ నెల 12న శబరికీ వెళ్లాడు. అయ్యప్పను దర్శనం చేసుకొని ఈ నెల18న తిరిగొచ్చాడు. శబరికి వెళ్తూ చెర్వుగట్టుకు వెళ్లి దర్శనం చేసుకొని వెళ్లాడు. శుక్రవారం ఉదయం భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి పల్సర్‌ బైక్‌పై నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టుకు వెళ్లాడు. దైవ దర్శనం పూర్తి చేసుకొని మధ్యాహ్నం తర్వాత వెనుదిరిగారు. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా దాటాక, ఆరెగూడెం క్రాస్‌రోడ్డు సమీపంలో ఓ డీసీఎం ఎక్సెల్‌ ఇరిగిపోవడంతో డ్రైవర్‌ రోడ్డు పక్కన ఆపి హైదరాబాద్‌కు వెళ్లాడు.

రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను రామకృష్ణ తన బైకుతో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రామకృష్ణ తల చిట్లి పోయి అక్కడికక్కడే మృతిచెందాడు. బైకుపై ముందు కూర్చున్న చిన్నబాబు తలకు, భార్య తలకు, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. మధ్యన కూర్చున్న పెద్దబాబు కడుపునకు తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్సులో రామకృష్ణ, పెదబాబు మణిచరణ్‌లను చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామకృష్ణ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించడంతో పోస్టుమార్టం నిమిత్తం అక్కడే ఉన్న మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన మణిచరణ్‌ను హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.