ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వృద్ధులను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంధించారు. బాధితుల కేకలు విన్న స్థానికులు అమీన్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధులను రక్షించి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు.. అనంతరం ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు బదిలీ చేశారు.
ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మెరాజ్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల పేరు మీద అమీర్‌పేటలోని లీలానగర్‌లో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి వివాదమే కిడ్నాప్‌నకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ భూవివాదంపై కోర్టు పరిధిలో విచారణ సాగుతోందని పోలీసులు తెలిపారు.
మరోవైపు కిడ్నాపర్లు తమ నుంచి కీలకమైన భూమి పత్రాలతో పాటు కొంత బంగారాన్ని లాక్కున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేసి తమ ఆస్తిని కాపాడాలని వేడుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులు బీదర్‌లో వున్నట్లు గుర్తించారు.