జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకల ఏరివేత కొనసాగుతోంది. గురువారం అర్ధరాత్రి నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొర జిల్లా పంపోర్ ప్రాంతంలోని ఖ్రూ వద్ద ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. గురువారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయ్యి.. ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని అధికారులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనేది తెలియాల్సి ఉందన్నారు. వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు పట్టుబడినట్టు వివరించారు. ఏకే 47, జిలిటెన్ స్టిక్స్, హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. హతమైన ఉగ్రవాదులను హిజ్బుల్ ముజాయిద్దీన్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు.
మరోవైపు, గురువారం రాజౌరి జిల్లాలోని థానమండి వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి అమరుడయ్యారు. థానమండి వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) చనిపోయారు. స్వాతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు కుల్గామ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో… లష్కరే తొయిబాకు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు.