Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న నేత ఇతర నాయకులతో అభిప్రాయ బేధాలతో ఆ పార్టీ నుంచి వెళ్లిపోవడం రాజకీయాల్లో సర్వసాధారణం. పార్టీలో ఉన్నతస్థానాలు అనుభవించి, ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ బయటకు వెళ్లిన తర్వాత మాత్రం…తన ప్రత్యర్థులపై ఎదురుతిరుగుతూ కక్ష తీర్చుకుంటూ ఉంటారు కొందరు నేతలు. పార్టీకి సంబంధించిన అనేక అంతర్గత రహస్యాలను బయటపెడుతూ వారిని ఇరుకున పెడుతూ ఉంటారు. సదరు నేతలు చెప్పే విషయాలు కొన్నిసార్లు తీవ్ర సంచలనం సృష్టిస్తుంటాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇలాంటి సందర్భమే వచ్చింది. శివసేనలో ఒకప్పుడు కీలకనేతగా ఉన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే పై సంచలనకర ఆరోపణలు చేస్తున్నారు.
నారాయణరాణే 2005 వరకు శివసేనలో ఉన్నారు. అనంతరం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ ఏడాది సెప్టెంబరులో అభిప్రాయబేధాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రాణే మహారాష్ట్ర స్వాభిమాన్ పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. రాష్ట్రంలోని అధికార బీజేపీతో పొత్తు పెట్టుకున్న మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది ముగిసే లోపు తాను మంత్రినవుతానని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే నారాయణ రాణేపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న శివసేన ఆయనకు మంత్రిపదవి ఇవ్వవద్దని బీజేపీపై ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమంలో రాణేపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కొన్ని ఆరోపణలు చేశారు. రాణే శివసేనలో ఉన్నప్పుడు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరేను వేధింపులకు గురిచేశారని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. ఈ ఆరోపణలపై సాంగ్లీలో పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పందించిన నారాయణ రాణే తండ్రీ కొడుకులు బాల్ థాకరే, ఉద్ధవ్ థాకరే మధ్య సంబంధాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఉద్ధవ్ నోర్మూసుకుని ఉండాలని, తనపై ఆరోపణలు మానుకోవాలని, లేకపోతే అన్ని విషయాలను బయటపెడతానని రాణే హెచ్చరించారు. ఉద్ధవ్, ఆయన కుటుంబం బాల్ థాకరే ను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిందో తాను కళ్లారా చూశానని, అవన్నీ ఇప్పుడు వెల్లడిస్తానని ఆయన హెచ్చరించారు. బాలా సాహెబ్ ను ఉద్ధవ్, ఆయన కుటుంబ సభ్యులు హింసిస్తుంటే తన కళ్లతో చూశానని, ఇకనైనా తన గురించి అవాకులూ, చవాకులూ పేలడాన్ని ఆపకుంటే..వాటన్నింటినీ బయటకు తెస్తానని ఆయన హెచ్చరించారు. సాహెబ్ బతికి ఉన్న సమయంలో తానెప్పుడూ ఆయన మాట జవదాటలేదని, ఆయన నివాసమైన మాతోశ్రీలో ఏం జరుగుతూ ఉండేదన్న విషయం తనకు తెలుసునని, తనపై ఆరోపణలు ఆపకుంటే..వాటన్నింటినీ బయటకు తెస్తానని అన్నారు.