ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలోని పలు నగరాలు, పట్టణాలపై ఆదివారం మరింత భారీ స్థాయిలో క్షిపణి, బాంబు దాడులకు దిగింది. సెంట్రల్ ఉక్రెయిన్లోని వినిటిసా నగరంలో విమానాశ్రయం రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. కాల్పుల విరమణకు రెండు రోజుల వ్యవధిలో రెండోసారి రష్యా తూట్లు పొడిచింది.
రేవు పట్టణం మారియుపోల్, వోల్నోవఖా నగరాల నుంచి పౌరులు సురక్షితంగా తరలిపోయేందుకు వీలుగా కొద్ది గంటలు కాల్పులు ఆపుతామని ప్రకటించి, కాసేపటికే భారీ కాల్పులతో వాటిపైకి విరుచుకుపడింది. శనివారం కూడా రష్యా ఇలాగే మాటిచ్చి తప్పడం తెలిసిందే. కీవ్‌కు ఉత్తరాన ఉన్న చెర్నిహివ్‌లో 500 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత శక్తిమంతమైన ఎఫ్‌ఏబీ–500 బాంబులను జనావాసాలపై రష్యా ప్రయోగించింది.
దుర్భేద్యమైన కట్టడాలను పేల్చేసేందుకు సైనిక, పారిశ్రామిక లక్ష్యాలపై మాత్రమే వీటిని ప్రయోగిస్తుంటారు. ఖర్కీవ్‌లో అణు పదార్థాలు, రియాక్టర్ ఉన్న ఓ పరిశోధన సంస్థపై కూడా రష్యా రాకెట్లు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. దాడుల్లో వాటికేమైనా అయితే భారీ వినాశనం తప్పదని ఆందోళన వెలిబుచ్చింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం మూడో రౌండ్ చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో కనీసావసరాలు తీరక విపరీతమైన చలి, ఆహారం, తాగునీటి కొరతతో ఉక్రెయిన్‌వాసులు అల్లాడుతున్నారు. కీవ్ సమీపంలోని ఇర్పిన్ వద్ద వేలాది మంది పొట్ట చేతపట్టుకుని పోలండ్, రొమేనియా, మాల్డోవా వైపు వెళ్లిపోతూ కన్పించా రు. వీరిలో పలువురు రష్యా తూటాలకు బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది!