ఉమ్ ఫున్.. తుఫాన్ తీవ్రతపై మోడీ అత్యవసర సమీక్ష

పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అతి తీవ్రరీతిలో తుపాన్‌ ఉమ్‌ పున్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో ఉమ్‌ పున్‌ కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. బెంగాల్‌లోని దిఘాకు 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. ఉత్తర ఈశాన్య దిశగా 8 కిలోమీటర్ల వేగంతో ఉమ్‌ పున్‌ కదులుతోంది. ఈ క్రమంలో ఉమ్‌ పున్‌ మరింత బలపడి పెను తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అదేవిధంగా ఈ నెల 20వ తేదీన సాయంత్రం తుపాను తీరం దాటే అవకాశం ఉంది. బెంగాల్‌ – బంగ్లాదేశ్‌ మధ్య హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. కాగా తుపాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి అతి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఉమ్‌ పున్‌ మరింత బలపడి పెను తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసిన క్రమంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. హోంశాఖ, ఎన్‌డీఎంఏ అధికారులతో మోడీ సమీక్ష జరపనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోడీ చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.