నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారం అవుతున్న బిగ్బాస్ సీజన్-5 రసవత్తరంగా సాగుతుంది. రెండు వారాల్లోనే కంటెస్టెంట్లు తమ ఉగ్రరూపాన్ని చూపించేస్తున్నారు. నామినేషన్స్ వచ్చేసరికి కంటెస్టెంట్ల అసలు రంగు బయటపడుతుంది. అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో తమను నామినేట్ చేసిన వ్యక్తులను నోటికి వచ్చినట్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు.
ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు కార్తిక దీపం ఫేమ్ ఉమాదేవి. గత వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడేసింది. ఆ బూతులకు బిగ్బాస్ బీప్ వేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కు ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆ వర్గం ఓట్లు బాగా తగ్గిపోయాయి. ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకునేలోపు ఆమె రెండోవారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
లోబోతో కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నా నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడకపోయి ఉంటే మరొకొన్ని రోజులు ఆమె బిగ్బాస్లో కంటిన్యూ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో గయ్యాళి అనే పేరు నుంచి తానెంటో నిరూపించుకుందాం అనుకున్న ఉమాదేవి చివరికి ఆ పేరుతోనే హౌస్ నుంచి బయటకు వెళ్లడం స్వయం కృపరాదం అనొచ్చు.ఇక బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. ఆ లెక్కన రెండు వారాలకు గాను ఆమెకు సుమారు రూ. లక్షా అరవై వేల పారితోషికం అందినట్లు సమాచారం.