ఉండవల్లి అరుణ్ కుమార్ వట్టి మాటగా కాకుండా నిజంగానే రాజకీయాల్ని కాచి వడపోసిన మేధావి. నాయకుడు కన్నా ఆయన విశ్లేషణ శక్తి మీదే జనానికి బాగా నమ్మకం , గురి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ నమ్మకానికి కూడా చిల్లులు పడ్డాయి అనుకోండి. ఆ తరువాత పేరు పెట్టలేదు కానీ చంద్రబాబు వ్యతిరేక ఉద్యమానికి తన వంతుగా ఆయన ఈ ఐదేళ్లలో మాట సాయం చేస్తూనే వచ్చారు. ఎన్నికలకు ముందు బాబు ఎలా గెలుస్తాడని ప్రశ్నించిన ఉండవల్లి తాజాగా పసుపు కుంకుమ పధకం కింద మహిళల అకౌంట్స్ లో పడ్డ 10 , 000 రూపాయల ప్రభావం ఎలా ఉంటుందో అని ఒక వైపు చెబుతూనే , ఇంకో వైపు ఆలా చేస్తే ఇక ప్రతి ఎన్నికల టైం లో ప్రభుత్వాలు ఇలా మభ్యపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అంటే పసుపు కుంకుమ అండర్ కరెంటు గా పనిచేసిందని ఆయన డౌట్ అని చెప్పకనే చెప్పారు. అందుకే మగవాళ్ల మాట ఆడవాళ్లు విన్నారా అన్న మాట కూడా ఆయన నోట వచ్చింది.
ఉండవల్లి నోట వచ్చిన ఈ పలుకులు టీడీపీ లో కొత్త ఉత్సాహం తెచ్చాయి. ఎన్నికలకు ముందు , తరువాత కూడా గెలుపు మీద ధీమాగా వున్న టీడీపీ ఇప్పుడు వైసీపీ నాయకుల కాన్ఫిడెన్స్ చూసి ఎక్కడో సందేహపడుతోంది. ఈవీఎం లలో ఏదైనా జరుగుతుందేమో అన్న భయం లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఉండవల్లి చేసిన కామెంట్స్ తో వైసీపీ మాత్రం టెన్షన్ పడుతోంది. పసుపు కుంకుమ గురించి మాత్రమే కాకుండా జగన్ ముఖ్యమంత్రి కావాలని తనకు ఉన్నప్పటికీ , అలా అవుతాడని గట్టిగా చెప్పలేను అన్న ఉండవల్లి మాటలు బాగా ధీమాగా వున్న వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి. ఏదేమైనా ఉండవల్లి తాజా కామెంట్స్ తో బాబు ఖుష్ , జగన్ గుస్సా అయ్యే ఛాన్స్ వుంది.