Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మౌనం మౌనం మధ్య మాటల మజిలీలా వింతైన రాజకీయ ప్రయాణం చేస్తున్న ఉండవల్లి గారు ఈసారి భలే మాటలు మాట్లాడారు. అది కూడా ఆంధ్రుల రాజధాని అమరావతి గురించి. ప్రతిష్టాత్మక రాజధానిగా అమరావతిని నిర్మించడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎగతాళి చేయడానికి అన్నట్టు కొన్ని కామెంట్స్ పాస్ చేశారు. బాబు కలలు కనే అమరావతి తాను చూడలేనని, అన్నాళ్ళు బాబు బతికి వుంటారేమోనని ఉండవల్లి అన్నారు. కాస్త భావపూరితంగా చెప్పినా ఈ అమరావతి ఇప్పట్లో అయ్యే పనేనా అన్న సెటైర్ ఉండవల్లి మాటల్లో కనిపించింది. వినడానికి ఆ సెటైర్ ఎలా అనిపించినా ఉండవల్లి లాంటి మేధావి ఇలాంటి మాటలు మాట్లాడతాడా అనిపించింది.
ఉండవల్లి అన్నట్టు అమరావతి ఇప్పట్లో పూర్తి కాకపోవచ్చు. కానీ ఒక్క ప్రాధమిక విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు. తాను నాటిన మొక్క తాను బతికి వున్నప్పుడే ఫలాలు ఇవ్వాలనుకుని, తనకే ఆ ఫలాలు చెందాలి అనుకుంటే ఈ భూమి ఇలా ఉండేది కాదు. ఈ జనం ఇలా వుండేవాళ్ళు కాదు. రేపటి తరం బాగుండాలంటే ఇప్పటి తరం పునాది వేయాలి అన్న చిన్న విషయాన్ని ఉండవల్లి ఎలా విస్మరించారో ఏమో. ఈ ఆలోచనా విధానం మామూలు మనిషికి లేకపోతే ఆ ప్రభావం సదరు కుటుంబానికే పరిమితం. కానీ ఓ పాలకుడుకి ఆ ముందు చూపు లేకపోతే ఆ జాతి మొత్తం నష్టపోతుంది. మన పూర్వీకులు కూడా ఉండవల్లి అనుకున్నట్టు మనం నాటిన చెట్టు కాయ మనమే తినాలి అనుకుంటే ఈ తరం ఇలా ఉండేది కాదు. ఉండవల్లి, చంద్రబాబు మాత్రమే కాదు ఇప్పుడు భూమి మీద వున్న 700 కోట్ల పైచిలుకు జనం పోయినా అమరావతి ఉంటుంది. అప్పటి తరం ఆ ఫలాలు ఆస్వాదిస్తుంది. అంతటి మేధావికి ఇంత చిన్న విషయం చెప్పాల్సి రావడం దురదృష్టం. అయినా చెప్పకతప్పడం లేదు. ఇంత చేసి తనకు వై.ఎస్ కుమారుడు జగన్ అంటే ఇష్టం అని ఉండవల్లి చెప్పడంతోనే ఆ మాటల వెనుక మర్మం ఏమిటో జనానికి అర్ధం అవుతోంది.