Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టినవారికి ఉరిశిక్షే…
కేంద్ర మంత్రివర్గం కీలక ఆర్డినెన్స్
కథువా అత్యాచారం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలకనిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో అత్యవసరంగా భేటీ అయిన మంత్రివర్గం పోక్సో చట్టానికి సవరణలు చేయాలని నిర్ణయించింది. 12 ఏళ్లలోపు వయసు కలిగిన చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టేవారికి మరణదండన విధించేలా రూపొందించిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్టంగా ఏడేళ్లు, గరిష్టంగా జీవితఖైదు విధించే అవకాశం ఉంది. అయితే అత్యాచారం తర్వాత బాధితురాలు మృతి చెందినా…అచేతనంగా మారినా…దోషికి మరణదండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు మార్చనున్నారు. ఈ మేరకు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. అప్పటివరకూ అమల్లో ఉండేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టినవారికి నేరతీవ్రతమేరకు మరణదండన విధించేలా శిక్షాస్మృతిలో మార్పులు చేయాలన్న ఆలోచనలో కేంద్ర న్యాయశాఖ ఉందని… శుక్రవారం కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పోక్సో చట్టానికి సంబంధించిన పూర్తి సవరణలపై చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.