ఇంత పెద్ద దేశంలో ఒకట్రెండు రేపులు కామనే… బీజేపీ మంత్రి

Union Minister santosh Gangwar comments on Rape Cases

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భారత దేశం ఎటు పోతోంది ? క్రమ క్రమంగా మన దేశం చీకటియుగం వైపు ప్రయాణిస్తున్నదా? క్రమంగా అన్ని విలువలు తరిగిపోయి మొదట ఆది మానవుల యుగానికి చేరుకుంటున్నదా? అంటే… అవుననే సమాధానం వస్తోంది. దేశంలో ఏదో రూపంలో జరుగుతున్న అనైతిక చర్యలు, దానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే అన్నీ అలానే అనిపిస్తోంది. మన దేశంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో రోజూవారీ ఘటనలే చెబుతున్నాయి. దేశంలో స్త్రీల పరిస్థితి ఎంత ఘోరంగా తయారయ్యిందంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది(ఒక సర్వే ప్రకారం). దీని గురించి ఎవరైనా, ఏ రాజకీయ నేత అయినా పట్టించుకున్నారా ?, కనీసం మాట్లాడారా అంటే కష్టమే, ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్న నేత యితే అధికార పక్షం మీద ఆరోపణలు చేయడానికి వాడుకుంటారు ఒక అస్త్రంలా, అదే అధికార పక్షంలో అయితే కనీసం ఆ మాట మాట్లాడడానికి సరికదా వినడానికి కూడా ఇష్టపడరు.

కానీ మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, దాడుల గురించి మన నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆలోచనలు మరింత భయం గొలిపేవిగా ఉన్నాయి. మొత్తంగా వారి మాటలు వింటే వారి మైండ్‌సెట్ ఎలా ఉన్నదో తెలుసుకోవచ్చు. భారతీయ సంస్కృతిలో మహిళలకే పెద్ద పీట అని కొన్ని సంప్రదాయ కబుర్లు చెబుతారు కాని మన దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవం అందు కు పూర్తి భిన్నంగా ఉంటోంది. ఇందుకు మన నేత లు వేరు వేరు సందర్భాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వారి మాటలు ఎంతలా ఉన్నాయంటే ఇలాంటి వారినా మనం నేతలుగా ఎన్నుకున్నది అని బాధ పడేంతగా. మొన్నటికి మొన్న అత్యాచారం అనేది పాశ్చాత్య నాగరికత దుష్ఫలితమని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు. ఇంకా ఒక అడుగు ముందుకేసిన హర్యానా ముఖ్యమంత్రి… మితి మీరిన స్వేచ్ఛ మహిళలకు పనికి రాదు. వారికి నడిరాత్రి రోడ్డుమీద తిరిగే పని ఏముంటుంది? స్వేచ్ఛ ఉన్నది కదా అని.. వారు నగ్నంగా రోడ్లపై తిరుగుతామంటే ఎలా? అని అంటూ స్వేచ్ఛకు కూడా ఒక హద్దు ఉండాలని సెలవిచ్చారు.

సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్… కుర్రాళ్లు తెలిసీ తెలియక తప్పు చేస్తారు. అంత మాత్రాన వారిని ఉరి తీస్తారా..! అని నిందితులను కఠినంగా శిక్షించాలంటున్న వారిని ప్రశ్నించారు. ఇంకో మహానుభావుడు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అయితే ఇంత పెద్ద దేశంలో లైంగిక దాడులు మామూలే. ఏదో ఒక మూల ఒకటో – రెండో ఘటనలకు విపరీత ప్రచారంతో రాద్ధాంతం అవసరం లేదనుకుంటా. వాటి నిలుపుదలకు ప్రభుత్వం కృషి చేస్తున్నా జరుగుతుండటం దురదృష్టకరం అంటారు. ఇంకా ఏ లోకంలో ఉన్నాం ఆటవిక సమాజంలో కూడా మనిషి కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని ఉంటాడే, దానికి మించిన ఆటవిక సమాజంలో మనం బతుకుతున్నాం అనిపిస్తోంది.