Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ బాబా, ఆయన దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ గురించి భారత్ లోని ప్రసార సాధనాల్లో రోజూ వార్తలొస్తూనే ఉన్నాయి. గుర్మీత్ దోషిగా నిర్ధారణ అయిన సమయంలోనూ, తర్వాత ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేసేటప్పుడూ దేశంలోని వార్తా చానళ్లు, పత్రికలు అన్నింటిలో ఆ వార్తే హైలెట్ అయింది. గుర్మీత్ గురించి భారతదేశమంతా మాట్లాడుకుంది. ఆ మాటకొస్తే…ఇప్పటికీ ఆయన అకృత్యాల గురించి…ఆయన కుమార్తెగా చెప్పుకునే హనీప్రీత్ గురించి రోజుకో వార్త మన పత్రికలు, టీవీల్లో వస్తూనే ఉంది. నిన్నటికి నిన్న హర్మీత్ అరెస్టు వార్త హైలెట్ గా నిలిచింది. కానీ ప్రపంచ వ్యవహారాలన్నింటినీ పరిశీలించే ఐక్యరాజ్యసమితికి మాత్రం ఈ విషయం తెలిసినట్టు లేదు.
ఐరాస ట్విట్టర్ ఖాతాలో చేసిన ఓ ట్వీట్ గమనిస్తే ఇదే భావన కలుగుతుంది. ఏటా నవంబరు 19న ప్రపంచ టాయిలెట్ డే నిర్వహిస్తోంది ఐక్యరాజ్యసమితి. ఈ సందర్భంగా ఐరాస జలరక్షణ విభాగం అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఓ ట్వీట్ చేసింది. సాధారణంగా ఐరాస తాము చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని వివిధ దేశాల్లోని ప్రముఖ వ్యక్తులను కోరుతుంటుంది. ఆ క్రమంలోనే మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిర్వహిస్తున్న ప్రచారానికి మద్దతు ఇవ్వాలని మంగళవారం ట్విట్టర్ ద్వారా డేరా బాబాను కోరింది ఐరాస జలరక్షణ విభాగం. అయితే గుర్మీత్ నుంచి స్పందన రాలేదనో..మరే కారణం చేతనో. ఆయన దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ కు బుధవారం ట్విట్టర్ ద్వారా మరో ఆహ్వానం పంపింది. డియర్ హనీప్రీత్. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా మీరు, గుర్మీత్ మాతో గొంతు కలుపుతారని ఆశిస్తున్నాం అని ట్వీట్ చేసింది. ఐరాస ట్వీట్లు చూసిన నెటిజన్లు షాక్ తిన్నారు. ఐరాసను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గుర్మీత్, హనీప్రీత్ జైలు నుంచి తప్పకుండా మీతో గొంతు కలుపుతారు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా…ఇంకో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అడగండి అంటూ మరొక నెటిజన్ వ్యగ్యంగా ట్వీట్ చేశారు. ఐక్యరాజ్యసమితి ట్విట్టర్ అకౌంట్ పర్యవేక్షించే వారికి భారత్ లోని పరిస్థితులపై అవగాహన లేదని జలవిభాగం చేసిన ట్వీట్లు చూస్తే అర్ధమవుతోంది. అయితే తమ తప్పు గ్రహించిన ఐరాస..కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్లు తొలగించివేసింది. కానీ బాబా అనుచరులు, అభిమాన గణం మాత్రం ఐరాస ట్వీట్ కు కొత్త అర్ధాలు చెబుతున్నారు. డేరాబాబా, హనీప్రీత్ చేసిన స్వచ్చంద కార్యక్రమాలను ఇన్నాళ్లకు ప్రపంచం గుర్తించిందని వారు ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఐక్యరాజ్యసమితి… భారత్ వంటి అది పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతోందో తెలుసులేక తప్పుడు ట్వీట్ చేసి అభాసుపాలయింది.