ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. స్థానిక పోలీసుల కళ్లుగప్పి ముంబై పారిపోయిన అతడిని అరెస్టు చేసి లక్నోకు తీసుకువస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసుల బృందం స్వల్ప గాయాలతో బయటపడింది. వివరాలు.. కరుడుగట్టిన నేరస్థుడు ఫిరోజ్ అలీ అలియాస్ షమీ జాడ కోసం యూపీ పోలీసులు గత కొన్ని రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముంబైలోని నాలా సొపారా అనే స్లమ్ ఏరియాలో అతడు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో లక్నోలోని ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్‌ఐ జగదీశ్ ప్రసాద్ పాండే, కానిస్టేబుల్ సంజీవ్ సింగ్‌లను ముంబై వెళ్లాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు.
కాగా ఫిరోజ్‌ను పట్టుకునేందుకు ప్రైవేటు వాహనం(కారు)లో బయల్దేరిన ఈ ఇద్దరు విజయవంతంగా అతడిని అరెస్టు చేశారు. అదే వాహనంలో లక్నోకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 26) గుండా ప్రయాణిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా సమీపానికి చేరుకోగానే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఫిరోజ్ అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జగదీశ్, సంజీవ్ సింగ్‌తో పాటు డ్రైవర్ సులభ్ మిశ్రా, ఫిరోజ్ బావ అఫ్జల్ గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రాజేశ్ కుమార్ సింగ్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఇక ఈ విషయం గురించి జగదీశ్ మాట్లాడుతూ.. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఆవును తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిందని తెలిపారు. ఫిరోజ్ అక్కడిక్కడే మృతి చెందగా తమకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఫిరోజ్ బావను కూడా అదుపులోకి తీసుకున్నామని, ఈ ప్రమాదంలో అతడి చేయి విరిగిపోయిందని తెలిపారు. కాగా ప్రత్యక్ష సాక్షులు మాత్రం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరుగుతున్నట్లు చెబుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఫిరోజ్, అఫ్జల్, సంజీవ్‌ను కారు బయటకు నెట్టివేశారని తెలిపారు.
గత కొన్ని రోజులుగా యూపీలో గ్యాంగ్‌స్టర్‌ల ఏరివేత కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌కు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను యూపీకి తీసుకువచ్చే సమయంలో ఇదే తరహా యాక్సిడెంట్ చోటుచేసుకోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేశారు. జులై నెలలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇక తాజా ఘటనపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.