నోరు జారిన ఇమ్రాన్‌ ఖాన్‌

నోరు జారిన ఇమ్రాన్‌ ఖాన్‌

తనను గద్దెదింపేందుకు జరుగుతున్న రాజకీయ కుట్ర వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు భారీగా డబ్బు ఎరవేసి ఆ దేశం ఈ పని చేయిస్తోందంటూ ఖాన్‌, అతని అనుచర గణం.. అవిశ్వాసం దరిమిలా పదే పదే రీల్‌ వేస్తున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా నేరుగా అగ్రరాజ్యం అమెరికా మీదే ఖాన్‌ విమర్శ చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది.

ఇమ్రాన్‌ ఖాన్‌ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని వైట్‌హౌజ్‌ ఉన్నతాధికారి కేట్‌ బెడింగ్‌ఫీల్డ్‌ వ్యాఖ్యానించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనను అధికారం నుంచి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పాక్‌ రాజ్యాంగం, చట్టాలపై మాకు గౌరవం ఉంది. జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మేం పరిశీలిస్తున్నాం’’ అంటూ ప్రకటనను ఆమె మీడియాకు చదివి వినిపించారు. అంతకు మించి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారామె.

ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం ఓ జాతీయ టీవీ ఛానెల్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ సుదీర్ఘ ప్రసంగం ప్రసారం అయ్యింది. ఈ సందర్భంగా తనను గద్దె దించేందుకు కారణం తన స్వతంత్ర్య విదేశాంగ విధానమే అని పేర్కొన్న ఖాన్‌.. ఉక్రెయిన్‌ ఉద్రిక్తల సమయంలో మాస్కోలో పర్యటించడం నచ్చకనే సదరు దేశం తనను గద్దె దించాలని కుట్ర చేసిందని ఆరోపించాడు. అయితే గంటపాటు సాగిన ప్రసంగంలో దాదాపుగా అమెరికా పేరు తీయకుండా మాట్లాడిన ఆయన.. మధ్యలో మాత్రం ఒకసారి నోరు జారి అమెరికా అని స్పష్టంగా పేర్కొన్నాడు.

ఈ తరుణంలోనే అమెరికా స్పందించింది.ఇక భారీగా మిలిటరీ, ఆర్థిక సాయం పాకిస్థాన్‌కు అందించినప్పటికీ.. తనను మాత్రం పట్టించుకోకపోవడంతోనే ఇమ్రాన్‌ ఖాన్‌, అమెరికాను ఒక విలన్‌గా చూస్తూ వస్తున్నాడు. అయితే అమెరికా మాత్రం పాక్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది.