లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్ల దందా విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అమ్మాయిని ఎరేసిన సైబర్ నేరగాళ్లు.. అతడి నుంచి డబ్బు లాగేశారు. అంతటితో ఆగకుండా మరింత వేధించారు. అయితే తాజాగా హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాలన బట్టి చూస్తే.. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచి పని చేస్తున్న ఓ యువకుడు.. ఖాళీ వేళల్లో వెబ్ సైట్ లో వీడియోలు చూస్తుండగా… అమ్మాయిలతో చాటింగ్, వీడియో కాలింగ్ కోసం సంప్రదించాలంటూ ఓ ఫోన్ నంబర్ కనిపించింది. అయితే ఆ యువకుడు అమాయకంగా ఆ నెంబర్ కి కాల్ చేశాడు. అప్పుడు ఓ యువతి మాట్లాడింది. ఆమె విసిరిన వలపులకు ఫిదా అయిన ఆ యువకుడు.. ఫోటోలు పంపించాలని కోరాడు. అంతేకాకుండా మొదట కాసిన డబ్బులు కూడా పంపించాడు.
అంతటితో ఆగలేదు. ఆ తర్వాత కూడా వీడియో కాలింగ్ ద్వారా కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో కాల్స్ ను క్యాప్చర్ చేసిన కేటుగాళ్లు.. ఆపై అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఇంకేముంది సామిరంగా.. ఆ యువకుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే రూ. 80 వేల వరకూ లాగేశారు. ఆ తరువాత మళ్లీ వేధించడం మొదలెట్టారు. బాధితుడు స్పందించక పోవడంతో ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాఫ్తు చేస్తున్నారనుకోండి. మొత్తానికి లాక్ డౌన్ వేళ సైబర్ నేరాలు మాత్రం తగ్గడం లేదు.