భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఈ సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. వాజ్ పేయి మరణంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక అటల్ జీ పార్థీవదేహాన్ని ఎయిమ్స్ నుంచి నేరుగా ఆయన నివాసానికి తరలించారు. వాజ్ పేయి అంతిమ సంస్కారాలు రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్ లో అంతిమసంస్కారాలు జరుగనున్నాయని తెలుస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి వాజ్ పేయి పార్థీవ దేహాన్ని తరలిస్తారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్మృతిస్థల్ లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.