బ్రహ్మయ్యలింగం చెరువు పూడికతీత విషయంలో వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావుకు అభ్యంతరాలుంటే దర్యాప్తు కోరవచ్చునని, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని గన్నవరం సిటింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాస్తూ తన స్పందన తెలిపారు. యార్లగడ్డ తనపై విమర్శలు చేసిన సమయంలో తాను ఊర్లో లేనని, అందుకే ఆలస్యంగా సమాధానం ఇస్తున్నానని తెలిపారు. గత కొంతకాలంగా ఇద్దరు నాయకుల మధ్య మాటలు, లేఖల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చెరువు పూడికతీత వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, తీసిన మట్టిని జాతీయ రహదారి, విమానాశ్రయం అవసరాలకు వినియోగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తాజాగా విడుదల చేసిన లేఖలో వంశీ స్పష్టం చేశారు. వాస్తవానికి వంశీ, యార్లగడ్డకు ఇంతకు ముందే లేఖ రాశారు. దీనిపై వెంకట్రావు మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇవ్వడంతో ప్రతిగా గురువారం వంశీ మరో లేఖ రాశారు.