నటి వనిత విజయకుమార్‌పై విమర్శలు

నటి వనిత విజయకుమార్‌పై విమర్శలు

నటి వనిత విజయకుమార్‌పై విమర్శలు గుర్తించిన యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంచలన నటిగా ముద్ర వేసుకున్న నటి వనితా విజయకుమార్‌ ఈ మధ్య పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె మూడో వివాహంపై పలువురి నుంచి పలు రకాల విమర్శలు వస్తున్నాయి. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, నటి కస్తూరి అదేవిధంగా నిర్మాత రవీంద్రన్‌ వంటి వారు వనితపై విమర్శల దాడి చేస్తున్నారు. అదే విధంగా సూర్యదేవి అనే యువతి నటి వనిత విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను యూట్యూబ్‌లో విడుదల చేసింది. దీంతో వనిత కూడా వారిపై ఎదురుదాడికి దిగింది. అయినా సూర్యదేవి విమర్శలు చేస్తూనే ఉండడంతో వనిత ఆమెపై వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వడపళని మహిళా పోలీసులు సూర్యదేవిని బుధవారం రాత్రి అరెస్ట్‌ చేశారు.

అయితే ఆమె వెంటనే గురువారం బెయిల్‌పై విడుదలైంది. సూర్యదేవి బెయిలుకు నటి కస్తూరి ప్రయత్నించింది. సూర్యదేవి అరెస్ట్‌ గురించి చేసిన వెంటనే ఆమెను ఎలాగైనా బెయిల్‌పై విడిపించాలని నటి కస్తూరి భావించిందట. దీంతో తన న్యాయవాది ద్వారా సూర్యదేవికి బెయిల్‌ వచ్చేలా చేసినట్లు కస్తూరి తెలిపింది. కాగా సూర్యదేవి బెయిల్‌పై స్పందించిన నటి వనిత పేర్కొంటూ సూర్యదేవి ఎలాంటి కారణాలు లేకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను చేసి తన మనసును గాయపరచిందని పేర్కొంది. అయితే ఆమె పిల్లల క్షేమం కోరి తాను ఆమెను రిమాండ్‌కు పంపాలని డిమాండ్‌ చేయడం లేదన్నారు. అందువల్ల సూర్యదేవి బెయిల్‌ను తాను వ్యతిరేకించడం లేదని చెప్పింది. అయితే ఇకపై అయినా సూర్యదేవి ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటుందని భావిస్తున్నారని పేర్కొంది. కాగా తన పెళ్లికి సంబంధించిన సమస్యను తాను చట్టపరంగా ఎదుర్కొంటానని వనిత చెప్పింది.