Varanasi: ‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై జక్కన్న మాస్టర్ ప్లాన్.. !

‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై జక్కన్న మాస్టర్ ప్లాన్.. హక్కులను విడివిడిగా అమ్మనున్నారా?
‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై జక్కన్న మాస్టర్ ప్లాన్.. హక్కులను విడివిడిగా అమ్మనున్నారా?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’పై Varanasi అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌ను కేఎల్ నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ హక్కుల వ్యవహారం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌కు మేకర్స్ నో చెప్పారా?

‘వారణాసి’ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే సినిమా భారీ బడ్జెట్, రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ మొత్తం ఆశించిన స్థాయిలో లేదని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

భాషల వారీగా ఓటీటీ హక్కుల విక్రయం?

ఈ నేపథ్యంలో డిజిటల్ హక్కుల ద్వారా మరింత ఆదాయం సంపాదించేందుకు రాజమౌళి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం డిజిటల్ రైట్స్‌ను ఒకే సంస్థకు విక్రయించకుండా, భాషలు మరియు ప్రాంతాల వారీగా వేర్వేరు ఓటీటీ సంస్థలకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ వ్యూహంలో భాగంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల హక్కులను ఒక సంస్థకు, హిందీ వెర్షన్ హక్కులను మరో సంస్థకు, అంతర్జాతీయ భాషల హక్కులను గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు విక్రయించేలా చర్చలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

డిజిటల్ రైట్స్‌తో భారీ రికవరీ లక్ష్యం!

ఈ విధంగా ప్రాంతాల వారీగా హక్కులను విక్రయించడం ద్వారా డిజిటల్ రైట్స్ నుంచే భారీ ఆదాయాన్ని పొందవచ్చని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఒప్పందాల ప్రక్రియను 2026 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

మరి ‘వారణాసి’ ఓటీటీ హక్కుల విషయంలో జక్కన్న అనుసరించనున్న ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి. అధికారిక ఒప్పందాలు వెల్లడైతే ఈ సినిమా డిజిటల్ మార్కెట్ విలువపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.