తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ Thalapathy Vijay మరోసారి కెమెరా ముందుకు రాబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఆయన సినిమా షూటింగ్‌లో పాల్గొనడం లేదు. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన ఓ ప్రచార ప్రకటనలో నటించబోతున్నట్లు సమాచారం.
పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించిన విజయ్, తన చివరి చిత్రం ‘జననాయగన్’ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అనంతరం తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)కు నాయకత్వం వహిస్తూ రాజకీయాల్లో బిజీ అయ్యారు. 2026 మేలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నారు.
ప్రభుత్వ యాడ్ కోసం రెండు రోజుల సమయం!
తాజా సమాచారం ప్రకారం, తమిళనాడు ప్రభుత్వ ప్రకటన చిత్రీకరణ కోసం విజయ్ రెండు రోజుల సమయాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ యాడ్‌కు దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల బృందంతో ఈ ప్రకటనను భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సాధారణ ప్రభుత్వ ప్రచార చిత్రాలకు భిన్నంగా ప్రత్యేకమైన రీతిలో దీనిని తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
సినిమాల్లోకి రీఎంట్రీ లేనట్టేనా?
విజయ్ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారనే వార్తతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇది కేవలం ప్రభుత్వ పథకాలు, సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూపొందిస్తున్న ప్రచార ప్రకటన మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతానికి సినిమాల్లోకి తిరిగి వచ్చే ఆలోచన లేదనే ప్రచారం కొనసాగుతోంది.
మరి ఈ ప్రభుత్వ యాడ్ ఎలా ఉండబోతోంది? విజయ్‌ను కొత్త అవతారంలో చూడబోతున్నామా? అనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.






