అంతరిక్షం ట్రైలర్… అద్భుతం అంతే !

ఏషియన్ సినిమాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్‌బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో అత్యంత సుందరమైన మల్టీప్లెక్స్‌గా నిలిచిన ఈ ఏఎంబీ సినిమాస్‌లో ‘ఎం లాంజ్’ అనే వీఐపీ లాంజ్‌ను ఏర్పాటు చేశారు. అంటే సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు ఈ లాంజ్‌లో జరుగుతాయి. ఇప్పుడు ఇదే లాంజ్‌లో ‘అంతరిక్షం’ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరితో పాటు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి, నిర్మాతలు క్రిష్ జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి, ఇతర నటులు పాల్గొన్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.‘ఘాజీ’ సినిమాలో సముద్రం అడుగున సబ్‌మెరైన్‌తో యుద్ధం ఎలా చేస్తారో ఓ థ్రిల్లర్ రూపంలో సంకల్ప్‌రెడ్డి మనకు చూపించారు. ఇప్పటి వరకు తెలియని ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించారు.
ఇప్పుడు ఆకాశంలో శాటిలైట్‌తో చేసే సైంటిఫిక్ యుద్ధాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘అంతరిక్షం’. ‘9000 కేఎంపీహెచ్’ అనేది ట్యాగ్‌లైన్. లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్, రాజా, శ్రీనివాస్ అవసరాల, రెహ్మాన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని, అంచనాలను పెంచేస్తోంది. కక్ష్యలోకి పంపిన ఓ శాటిలైన్‌లో సమస్య తలెత్తడం దానిని సరిచేసేందుకు సైంటిస్ట్ దేవ్ రంగంలోకి దిగడం ఆ శాటిలైట్‌ సమస్యను సరిదిద్దడానికి అంతరిక్షంలోకి వెళ్లడం ఆ తరవాత అక్కడ ఏం జరిగింది అనేదే ప్రధాన కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆస్ట్రోనాట్ లుక్‌లో వరుణ్ తేజ్ చాలా బాగున్నాడు.  ట్రైలర్‌లో విజువల్స్‌తో పాటు డైలాగులు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.