న్యాయం కోసం వెళ్తే…రూమ్ తీసిస్తా తిరుమల రమ్మన్నాడు…!

Vayalpadu CI Phone Conversation With Woman

కంచే చేను మేస్తే ఇంకా ఆ చేనుకి కాపలా ఎవరు ? న్యాయం చేయాలని కోరిన ఓ మహిళను తిరుమలలోని రూమ్‌కు రావాలంటూ వేధించాడు ఒక సీఐ. తిరుమల పుణ్యక్షేత్రంలో గరుడోత్సవం ఉండడంతో ఓవైపు భక్తుల సందడి, గోవిందనామాల స్మరణతో మారుమోగుతుంటే మరోవైపు వారికి రక్షణ కల్పించాల్సిన ఓ సీఐ కీచకుడి అవతారమెత్తాడు. దీంతో ఆ మహిళ మంగళవారం తిరుమలలో బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం వద్దకు చేరుకొని అక్కడున్న విలేకరుల ఎదుట తన బాధ చెప్పుకుంది. విలేకరులకు చెందిన సంయుక్త అనే మహిళ చెందిన తనకు అదే గ్రామానికి చెందిన వెంకటరత్నంతో 2006లో వివాహమైందని , ఒక పాప జన్మించిన తర్వాత తన భర్త జీవనోపాధికి కువైట్ వెళ్లాడని తెలిపింది.ఈ నేపధ్యంలో తన అత్తమామలు తనను అదనపు కట్నం తేవాలని వేధించేవారని పేర్కొంది. ఈమేరకు ఆనాడు తాను పీలేరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అప్పుడు పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా తేజోమూర్తి ఉండేవాడని తెలిపింది. ఏడాది గడుస్తున్నా తనకు న్యాయం జరగకపోవడంతో అత్తమామలు, భర్త రెండోపెళ్లిపై మళ్లీ ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషన్‌కు వెళ్లానన్నారు. తర్వాత తేజోమూర్తి వివిధ స్టేషన్లలో పనిచేసి ఇప్పుడు సిఐ స్థాయికి వెళ్లారు.

Vayalpadu CI Phone Conversation

 

కేసు విచారణ పేరుతో సంయుక్తతో తరచూ సిఐ ఫోన్‌లో మాట్లాడడం, వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టడం చేస్తున్నారు. ఓసారి రాయచోటి వద్దనున్న గాలివీడులోని వారి సమీప బంధువుల ఇంటికి తీసుకెళ్లి బలవంతం చేయబోగా అరిచి అందరినీ పిలిచి పరువు తీస్తానని చెప్పడంతో వెనక్కి తగ్గాడని మరోసారి ఇలా తిక్క వేషాలేస్తే డీఎస్పీ, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించినా కూడా లెక్కచేయకుండా ‘వాళ్లు కూడా పోలీసులే నన్నేం చేయరు’ అని సమాధానమిచ్చి బెదిరించడం మొదలుపెట్టాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తుకు తిరుమలకు వచ్చిన సీఐ ఆమెను తిరుమలకు రమ్మని వాట్సాప్ మెసేజ్ పంపినట్లు తన సెల్‌లో ఉన్న మెసేజ్‌ను మీడియాకు చూపించింది.అంతేకాకుండా తిరుమలలో నందకంలో తనకోసం ఒక గది పెట్టినట్లు అక్కడకు వస్తే ఇద్దరూ కలిసి ఉండవచ్చని ఫోన్లో చెప్పిన విషయాన్ని మీడియాకు వినిపించింది. కాగా సంయుక్త తిరుమలలో విధులు నిర్వహిస్తున్న సిఐని నిలదీద్దామని మంగళవారం మహిళా సంఘాలతో కలిసి వెళ్లగా విషయం తెలుసుకుని సిఐ అక్కడినుంచి ఉడాయించాడని తెలుస్తోంది. కాగా, సీఐపై శాఖాపరమైన చర్యలకు డీఐజీ ఆదేశించారు.