Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : సచిన్ జోషి , ఇషా గుప్తా , ప్రభు , కిషోర్
నిర్మాత : రైనా జోషి
దర్శకత్వం : తాటినేని సత్య
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్ ఎస్.ఎస్
సినిమాటోగ్రఫీ : బినేంద్ర మీనన్
ఈ శుక్రవారం మొత్తం ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. ఉంగరాల రాంబాబు , శ్రీవల్లి, కధలో రాజకుమారి, సరసుడు, వీడెవడు…ఈ 5 సినిమాల్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన సినిమా వీడెవడు. ఏ అంచనాలు లేకుండా వెళ్లిన ప్రేక్షకుడికి ఈ సినిమా చూసాక ఏమి అనిపించింది ? . తెలుగులో ఘోర పరాజయాలు ఎదురు అవుతున్నా పదేపదే ప్రయత్నాలు చేస్తున్న హీరో సచిన్ జోషి ఈ సారి ఎలాంటి ఫలితం పొందాడో చూద్దామా ?
కథ…
సత్య ( సచిన్ ) ఓ కబడ్డీ ఆటగాడు. అతడు శృతి( ఇషా గుప్త ) అనే ఓ డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.కానీ తొలి రాత్రే శృతిని చంపాడన్న కేసులో సత్య జైలు పాలవుతాడు. నిజానికి శృతిని సత్య చంపాడా ఇంకెవరి హస్తం అయినా ఉందా? ఈ కేసు నుంచి సత్య బయటపడ్డాడా అన్నది ఎవడేంటే మిగిలిన కధ.
విశ్లేషణ…
దర్శకుడు తాతినేని సత్య, మౌనమేలనోయి, నీ జతగా నేనుండాలి, ఒరే పండు వంటి చిత్రాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన హీరో సచిన్ కాంబినేషన్ లో సినిమా అని తెలిసి ఏదో టైం పాస్ చేద్దామని వెళ్లిన ప్రేక్షకుడికి తొలి సీన్ తోనే అలెర్ట్ అయిపోతాడు. శోభనం రాత్రి పెళ్లికూతురు చనిపోవడం తో మొదలైన కధ ఎక్కడా ప్రేక్షకుడిని ఊపిరి తీసుకోనివ్వదు. హీరో జైలు కి వెళ్లడం, అసలే సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటే సచిన్ స్నేహితుడి పాత్రలో శ్రీనివాస రెడ్డి, జైలు అధికారి పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు రువ్వేసారు. జైల్లో సత్య మీద హత్య ప్రయత్నం తో కధ కీలక మలుపు తిరుగుతుంది. ఆ ప్రయత్నం చేసింది ఎవరు అని తేల్చే సీన్, ప్రీ క్లైమాక్స్ సహా చివరి అర్ధ గంట సినిమా ప్రేక్షకుడిని సీట్ చివరికి చేరి మునిగాళ్ళ మీద కూర్చునేలా చేస్తుంది. క్లైమాక్స్ కూడా షాక్ ఇస్తుంది.
దర్శకుడు తాతినేని సత్య ఓ మంచి ప్రేమ కధ, క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ని కలుపుతూ కధ, కధనాలు పరుగులెత్తించాడు. సచిన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం సినిమా మీద అతనికి వున్న నమ్మకానికి గుర్తు. అయితే ఈ సినిమాలో అక్కడక్కడా సచిన్ ఇంకా బాగా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఏదేమైనా సచిన్ ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా బయటికి వచ్చింది కాబట్టి వీడెవడు సక్సెస్ లో అతనికి భాగం ఉంటుంది. మొత్తానికి ఏ అంచనాలు లేకుండా వచ్చి వీడెవడు సైలెంట్ గా హిట్ కొట్టేసినట్టే అనిపిస్తోంది.