సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ -1989 చట్టంను కేంద్ర ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. ఈ సవరణలో భాగంగా ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు రిజిస్టర్డ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడాన్ని తప్పనిసరి చేస్తూ రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం న నోటిఫికేషన్ జారీ చేసింది. అన్నీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు వచ్చే ఏడాది నుంచి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల నుంచి మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని పేర్కొంది.8 ఏళ్ల పాత వాహనాలకు రెండు సంవత్సరాల పాటు, అంతకు మించిన పాత వాహనాలకు ఒక ఏడాది పాటు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఏటీఎస్ అందించనుంది.
రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం…హెవీ గూడ్స్ వెహికల్స్/హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్స్ కోసం ఏప్రిల్ 1, 2023 నుంచి, మీడియం గూడ్స్ వెహికల్స్/మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికల్స్, లైట్ మోటర్ వెహికల్స్ కోసం జూన్ 1, 2024 నుంచి వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని నోటిఫికేషన్ వెల్లడించింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ నిబంధనలలో మార్పులను ప్రతిపాదిస్తూ గతంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
కాగా తుది నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి అభ్యంతరాలు లేదా సూచనలను లేవనెత్తడానికి 30 రోజుల సమయాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చింది.ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా వాహన ఫిట్‌నెస్‌ని తనిఖీ చేయడానికి అవసరమైన వివిధ పరీక్షలను ఆటోమేట్ చేయడానికి మెకానికల్ పరికరాలతో చేయనుంది. ఈ టెస్టింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి ఏటీఎస్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పేందుకు గత ఏడాది అనుమతులను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.