భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిపై అభిశంస‌న‌ను తిర‌స్క‌రించిన ఉప‌రాష్ట్ర‌ప‌తి

Venkaiah Naidu rejects Opposition Impeachment Motion Against Dipak Misra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశ చ‌రిత్ర‌లో తొలిసారి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రాపై ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇచ్చిన అభిశంస‌న నోటీసును ఉపరాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు తిర‌స్క‌రించారు. న్యాయ‌కోవిదుల అభిప్రాయం తీసుకున్న త‌ర్వాత వెంక‌య్య‌నాయుడు తన నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ స‌హా ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఎంపీలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉద్వాస‌న ప‌ల‌కాల‌ని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ కు గ‌త శుక్ర‌వారం నోటీసిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ముస్లింలీగ్ స‌భ్యులు సంత‌కాలు చేశారు. మొత్తం 71 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు సంత‌కాలు చేసిన‌ప్ప‌టికీ… వారిలో ఏడుగురు ఇటీవ‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. దీంతో 64 మంది మాత్ర‌మే సంత‌కం పెట్టిన‌ట్ట‌యింది. మొత్తం ఐదుర‌కాల దుష్ప్ర‌వ‌ర్త‌న ఆధారంగా ఈ నోటీసు ఇచ్చారు. అయితే ఈ నోటీస్ పై కాంగ్రెస్ లో విభేదాలు చోటుచేసుకున్నాయి.

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తో పాటు మ‌రికొంద‌రు సీనియ‌ర్లు నోటీసుపై సంత‌కాలు చేసేందుకు నిరాక‌రించారు. అటు నోటీసు నేప‌థ్యంలో హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌ను అర్ధాంత‌రంగా ముగించుకుని ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన వెంక‌య్య‌నాయుడు న్యాయ, రాజ్యాంగ నిపుణుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి, లోక్ స‌భ మాజీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ సుభాష్ క‌శ్య‌ప్, న్యాయ‌శాఖ మాజీ కార్య‌ద‌ర్శి పీకె మ‌ల్హోత్రా, శాస‌న వ్య‌వ‌హారాల మాజీ కార్య‌ద‌ర్శి సంజ‌య్ సింగ్ తో పాటు ఇతర సీనియ‌ర్ అధికారులతో రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా… న్యాయ‌కోవిదులంతా నోటీసును తిరస్క‌రించాల‌ని స‌ల‌హా ఇచ్చారు. రాజ్య‌స‌భ చైర్మ‌న్ నిర్ణ‌యాన్ని ముందుగానే ఊహించిన ప్ర‌తిప‌క్షాలు ప్ర‌త్యామ్నాయం కూడా సిద్ధంచేసుకున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి.

మ‌రోవైపు అభిశంస‌న నోటీసును చీఫ్ జ‌స్టిస్ పై తిరుగుబాటు చేసిన న్యాయ‌మూర్తులు స‌హా ఎవ‌రూ స‌మ‌ర్థించ‌డం లేదు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎన్నో మార్గాలున్నాయ‌ని, అభిశంస‌న ఒక్క‌టే మార్గం కాద‌ని… ఉన్న‌త‌స్థాయి న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో జ‌రిగే త‌ప్పుల‌కు అభిశంస‌న స‌మాధానం కాద‌ని తిరుగుబాటు న్యాయ‌మూర్తుల్లో ఒక‌రైన జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ వ్యాఖ్యానించారు. అభిశంస‌న తీర్మానం పెట్ట‌డం దుర్దినం అని, సీనియ‌ర్ న్యాయ‌వాది ఫాలీ నారీమ‌న్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఒక జ‌డ్జిమెంట్ పై అభిశంస‌న‌కు రావ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని, ఇందుకు కావాల్సిన సాక్ష్యాధారాల‌న్నీ పెట్టాల్సి ఉంటుంద‌ని, అభిశంస‌న తీసుకురావ‌డం రాజ్యాంగాన్ని కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌ని ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. అభిశంస‌న తీర్మానం తీసుకురావ‌డాన్ని ప్ర‌మాద‌క‌రం, ఆత్మ‌హ‌త్యాస‌దృశ్యంగా జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి అభివ‌ర్ణించారు.