ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కి ఉపరాష్ట్రపతి బయలుదేరారు. కాగా నేటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జేసీ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పొరపాటు కూడా లేకుండా రెవెన్యూ, జీవీఎంసీ ఆధికారులు సమన్వయంతో విధులను నిర్వహించాలన్నారు. విధులను నిర్వహించే వారందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు.
ఉపరాష్ట్రపతి మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. అక్కడే జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో పాల్గొంటారన్నారు. పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జరిగే 61వ నేషన్ డిఫెన్స్ కాలేజ్ కోర్స్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 3,4,5 తేదీల్లో నగరంలోని వివిధ కార్యక్రమంలో పాల్గొని 6వ తేదీ సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పాట్నా వెళతారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాస మూర్తి, ఆర్డీవో పెంచల కిషోర్, డీఆర్డీఏ పీడీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.