Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పుష్కర కాలంగా టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ శ్రియ. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ అమ్మడు గత కొన్నాళ్లుగా ఫేడ్ అవుట్ అవుతూ వస్తుంది. హీరోయిన్స్ ఒకానొక సమయం వచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల్సి ఉంటుంది. కాని శ్రియ మాత్రం ఇప్పటికి కూడా స్టార్ హీరోలకు తానే దిక్కు అన్నట్లుగా నిలుస్తుంది. ఇటీవల ఏ స్టార్ హీరో సినిమా అయినా శ్రియ హీరోయిన్గా ఉండాల్సిందే. ఆ మద్య ‘మనం’ చిత్రంలో నాగార్జునకు జోడీగా నటించింది. ఆ తర్వాత బాలకృష్ణతో వరుసగా రెండు చిత్రాల్లో జతగా నటించింది. గోపాల గోపాల చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పుడు మరోసారి వెంకటేష్‌తో ఈమె నటించేందుకు సిద్దం అవుతుంది.
వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆటనాదే వేట నాదే’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించబోతున్నారు. వేసవి చివర్లో సినిమాను విడుదల చేసేలా దర్శకుడు తేజ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్‌కు హీరోయిన్గా పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించిన దర్శకుడు తేజ చివరకు శ్రియ వద్దకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. గతంలో రెండు సార్లు కలిసి నటించిన వీరిద్దరు మరోసారి జత కట్టేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి స్థాయి కొత్త స్క్రిప్ట్‌తో తెరకెక్కబోతుంది.