Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘గురు’ చిత్రం తర్వాత వెంకటేష్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా ఒక చిత్రం తెరకెక్కాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. తేజ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. బాలకృష్ణ కోరిక మేరకు తేజ ఎక్కువ శ్రద్ద పెట్టి మరీ ఎన్టీఆర్ స్క్రిప్ట్‌ను రెడీ చేయిస్తున్నాడు. ఆ కారణంగానే వెంకటేష్‌తో సినిమాను తేజ పక్కకు పెట్టినట్లుగా సమాచారం అందుతుంది. వెంకటేష్ నిన్న మొన్నటి వరకు తేజ సినిమా కోసం రెడీ అయ్యాడు. కాని ఆ సినిమా అటకెక్కడంతో ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
అనీల్ రావిపూడి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి వెంకటేష్ ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దిల్‌రాజు బ్యానర్లో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’లో వెంకీ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఒక విభిన్న తరహా స్క్రిప్ట్‌తో దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అనీల్ రావిపూడి చిత్రం పూర్తి అయిన వెంటనే బొమ్మరిల్లు భాస్కర్ మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా వెంకటేష్ సినిమాలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో వెంకీ రెండు చిత్రాలు చేసే అవకాశం ఉంది.