సన్‌రైజర్స్‌కు గుడ్‌లక్‌ చెప్పిన వెంకటేష్

సన్‌రైజర్స్‌కు గుడ్‌లక్‌ చెప్పిన వెంకటేష్

కరోనా వైరస్‌ కారణంగా ఆలస్యమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అభిమానులకు అసలైన మజాను ఇస్తోంది. ముగిసింది రెండో మ్యాచ్‌లు అయినా.. క్రికెట్‌ కిక్‌ను అందించింది. ఇక తమ అభిమాన జట్ల మ్యాచ్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక హాట్‌ పేవర్‌ టీమ్‌గా బరిలోకి దిగిన బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌(ఆర్‌సీబీ)‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌‌ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య ఐపీఎల్‌ సీజన్‌ 2020 తొలి మ్యాచ్‌ నేడు (సోమవారం) జరుగనుంది.

దుబయ్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆటగాళ్లూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు జట్టు సన్‌ రైజర్స్‌ ఈ సీజన్‌లో ఎన్నో ఆశలతో​ బరిలోకి దిగుతోంది. దీంతో నేటి తొలిమ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

దీనిలో భాగంగానే టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు విక్టరీ వెంకటేష్‌ హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టుకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పాడు. తొలి మ్యాచ్‌లో ఆడుతున్నందున విషెస్‌ తెలియజేసిన విక్టరీ.. తమ మద్దతు ఎప్పుటికీ ఉంటుందని మరోసారి తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్‌పై వెంకీకి మొదటి నుంచీ మక్కువ ఎక్కువే. హైదరాబాద్‌లో మ్యాచ్‌ జరిగితే మైదానంలో వాలిపోవాల్సిందే. ఇక సొంత జట్టుకు మద్దతు విషయంలో ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరోవైపు వెంకటేష్‌తో పాటు టాలీవుడ్‌ హీరోలు మంచు మనోజ్‌తో సహా మరికొంత మంది సన్‌రైజర్స్‌కు గుడ్‌లక్‌ చెప్పారు. ఇక ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ఇదే తొలి మ్యాచ్‌ కావడం.. విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్‌ మజా అందనుంది. ఇక తొలిలో విజయం కోసం ఇరు జట్లూ వ్యహాలను సిద్ధం చేశాయి.