అన్నగారితో వేణుమాధవ్ కి ఉన్న అనుబందం

అన్నగారితో వేణుమాధవ్ కి ఉన్న అనుబందం

టాలీవుడ్‌లోకి అడుగు  పెట్టకముందు టీడీపీ ఆఫీసులో వేణుమాధవ్ పనిచేసేవారన్న విషయం తెలిసిందే. దివంగత నేత మాధవరెడ్డి ద్వారా టీడీపీకి దగ్గరయ్యారు. మహానాడు లాంటి కార్యక్రమాల్లో మిమిక్రీ చేసేవారు. అలా అన్న ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు. తొలుత హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీసులో పనిచేసిన ఆయన.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడి ఆదేశాలతో అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీసుకు మారారు. అక్కడి లైబ్రరీ పనులు చూసుకునేవారు. ఓ ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని వేణుమాధవ్ పంచుకున్నారు. ఎన్టీఆర్ ఇంటి దగ్గర డ్యూటీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఉద్వేగానికి గురయ్యారు. తనను ఎన్టీఆర్.. బొమ్మగారు అని పిలిచేవారని మురిసిపోయారు. ఈ సందర్భంగా ఓసారి ఎన్టీఆర్ తనపై మండిపడ్డ విషయాన్ని చెప్పిన ఆయన.. ఆ వెంటనే ప్రేమను చూపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

‘‘ఒకరోజు రాత్రి ఎన్టీఆర్ గారు.. రేపటి ప్రెస్ మీట్ గురించి మీడియాకు చెప్పమన్నారు. వెంటనే మీడియాకు ఆ సమచారం అందించాము. తర్వాతి రోజు ఉదయం ఆయన వచ్చి ప్రెస్ మీట్ క్యాన్సల్ అని చెప్పారు. ఆశ్చర్యపోవడం మా వంతైంది. ఈ విషయం మీడియాకు చెబితే.. వచ్చిన విలేఖర్లు నన్ను నానా మాటలు అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్.. నైట్ డ్యూటీలో ఉన్నవారిని లోపలికి రమ్మనమని కబురుపెట్టారు. అక్కడికి వెళ్లాక.. తెల్లవారుజామున మూడు గంటల నుంచి గదిలో లైటు వెలుగుతూ ఉండటంపై ఆరాతీశారు. అలాగే లైటు వేసి ఉంచితే.. యూనిట్‌కు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అంటూ మండిపడ్డారు. విద్యుత్‌ను వృథా చేయొద్దంటూ చివాట్లు పెట్టారు. ఏంట్రా ఇది అనుకుంటూ బయటకు వచ్చాను. మరికొద్దిసేపటికి మళ్లీ ఆయన పిలిచారు. ఈరోజు నా పని అయిపోయిందిరా అనుకుంటూ లోపలికి వెళ్లాను. ఆసమయంలో ఆయన టిఫిన్ చేస్తున్నారు. ఇంకోసారి ఇలా చేయొద్దంటూ.. తను తింటున్న దోశలోంచి చిన్న ముక్క తీసి నాకు ఇచ్చారు. టిఫిన్ చేస్తావా అని అడిగారు. వద్దని చెప్పి బయటకు వచ్చేశాను. ఇలా ఉంటుంది ఆయన ప్రేమ. నన్ను ఎప్పుడూ బొమ్మగారు అని పిలిచేవారు. నా దగ్గర టాకింగ్ డాల్ ఉండటం వల్ల ఆ పేరు పెట్టారు’’ అంటూ ఎన్టీఆర్‌తో తనకున్న సంబంధాన్ని ఒక కార్యక్రమంలో పంచుకున్నారు.ఇప్పుడు ఆయన లేరనే విషయాన్ని జీర్నించుకోలేకపోతున్నారు అభిమానులు.