పరిటాల అనుచరుడి షాక్…!

Vepakunta Rajanna Slams Paritala Sunitha Anantapur

రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ పరిటాల రవి ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న ఆరోపించారు. సునీత వైఖరి వల్లే తాను నాలుగేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. స్వగ్రామం తల్లిమడుగులలో టీడీపీ నేతలు, అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే నాడు పరిటాల రవితో కలిసి భూస్వామ్య పోరాటాలు చేసినట్టు రాజన్న తెలిపారు. భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సునీత ఆయన ఆశయాలను పక్కనపెట్టారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ సభ్యులు, బంధువులకు తప్ప పేదలకు, బడుగు బలహీన వర్గాలు జరుగుతున్న మేలేమీ లేదన్నారు. ఇక సునీతతో వేగలేమని, పార్టీని వీడుదామంటూ రాజన్న పిలుపునిచ్చారు. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఆయన అధికారిక ప్రకటన ఇప్పుడు చేసినా వాస్తవానికి ఆయన ముందు నుండీ వైసీపీ నాయకులతోనే తిరుగుతున్నారు.

ఈ నూతన సంవత్సరాదిన రాప్తాడు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ప్రకాష్ రెడ్డితో కలిసి జగన్ ని కలిసి కూడా వచ్చాడు. ఒకప్పుడు పరిటాల రవి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ను పతాకస్థాయిలో నడిపారంటే అందుకు ఆయన అనుచరుల బలమే కీలకం. అయితే ఇప్పుడు పరిటాల కుటుంబం అనుచరులు, నమ్ముకున్న వారు అన్న కోణంలో కాకుండా బంధుప్రీతితో పనిచేస్తోందన్న విమర్శలు అధికమవుతున్నాయి. పరిటాల సునీత అమె కుమారుడు కేవలం బంధువులకు, డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఇటీవల నియోజకవర్గంలో చాలా మంది అనుచరులు వారికి దూరమయ్యారు. రవికి రైట్ హ్యాండ్‌లాంటి చమనే ఒక దశలో వైసీపీలో చేరేందుకు ఆలోచన చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వేపకుంట రాజన్న పరిటాల రవికి అత్యంత ముఖ్యమైన అనుచరుడు. కానీ సునీత, శ్రీరాములు మాత్రం అలాంటి వారిని పక్కన పెట్టి నియోజకవర్గంలోని ఒక్కో మండలాన్ని ఒక్కో బంధువుకు అప్పగించేశారన్న ఆరోపణ వస్తోంది. బహుశా అందుకే రాజన్న పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారేమో అని భావిస్తున్నారు.