తమిళ అగ్ర హీరో విజయ్, ఆయన తండ్రి చంద్రశేఖర్ మధ్య వ్యవహారం రంజుగా కొనసాగుతోంది. తన పేరు మీద రాజకీయ పార్టీ ప్రారంభించడాన్ని సీరియస్గా తీసుకున్న విజయ్.. ఆ పార్టీలో తన అభిమానులెవరూ చేరొద్దని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులతో సమావేశమైన విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఏ చంద్ర శేఖర్ సానుభూతిపరులను అభిమాన సంఘం నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
30 జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యకర్తలతో విజయ్ అత్యవసర భేటీ జరిపిన అనంతరం…మదురై, తిరుచ్చి సహా అనేక జిల్లాలకు నూతన కార్యవర్గాలను ప్రకటించారు. తన తండ్రితో సంబంధాలున్న ప్రతి ఒక్కరిని విజయ్ మక్కళ్ ఇయక్కం నుండి తొలిగించినట్లు విజయ్ ప్రకటించాడు. ఇతరులు తన ఫోటోని గానీ, విజయ్ మక్కళ్ ఇయక్కం పేరుని గాని అనుమతి లేనిదే ఉపయోగిస్తే కఠినచర్యలు తప్పవని విజయ్ హెచ్చరించాడు.
ప్రముఖ దర్శకుడు, హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్.. విజయ్ పేరు మీదుగా రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. వెంటనే స్పందించిన విజయ్ ఆ రాజకీయ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని, అభిమానులెవరూ అందులో చేరొద్దని ప్రకటించారు.