‘మీకు మాత్రమే చెప్తా’ ప్రొడక్షన్ పై స్పందించిన విజయ్ తండ్రి

'మీకు మాత్రమే చెప్తా' ప్రొడక్షన్ పై స్పందించిన విజయ్ తండ్రి

విజయ్ దేవరకొండ  ఇప్పటిదాకా సంపాదించిందాంట్లో 70 శాతం ఖర్చు పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా తీశానని ఈ చిత్ర విడుడదలకు ముందు ఘనంగా ప్రకటించేశాడు . హీరోగా విజయ్ ఇప్పటికే ఏడెనిమిది సినిమాలు చేశాడు. అందులో నాలుగు పెద్ద హిట్లున్నాయి. కొత్త కమిట్మెంట్లతో కలిసి అతను ఇప్పటికే రూ.20-25 కోట్ల దాకా ఆర్జించి ఉండే అవకాశముంది. మరి అందులో 70 శాతం పెట్టి సినిమా తీసి ఉంటాడా అనే విషయంలో ముందే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఐతే కొంత అతిశయోక్తి జోడించి ఉన్నప్పటికీ  ఇలా అన్నాడంటే సినిమాకు బాగానే ఖర్చు చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ థియేటర్లలో బొమ్మ చూశాక జనాలకు దిమ్మదిరిగిపోయింది. విజువల్స్, లొకేషన్లు, కాస్టింగ్ అంతా చూస్తే సినిమాకు కోటి రూపాయలైనా ఖర్చు అయి ఉంటుందా అన్న సందేహాలు కలిగాయి.

‘మీకు మాత్రమే చెప్తా’ ఒక ఫీచర్ ఫిలిం లాగే అనిపించకపోవడానికి ప్రొడక్షన్ వాల్యూస్‌ నాసిరకంగా కనిపించడమే కారణం. షార్ట్ ఫిలిమ్ లుక్ కనిపించింది సినిమాలో. విజయ్ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో బాగా రాజీ పడ్డట్లే అనిపించింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విజయ్ తండ్రి, చిత్ర నిర్మాతల్లో ఒకడైన వర్ధన్ స్పందించాడు.

అందరూ అనుకుంటున్నట్లు ‘మీకు మాత్రమే చెప్తా’కు తక్కువ ఖర్చేమీ కాలేదన్నాడు. రూ.5 కోట్ల దాకా ఖర్చు పెట్టామన్నాడు. మరి విజువల్స్ ఎందుకు అలా ఉన్నాయని అడిగితే  పోస్ట్ ప్రొడక్షన్ సరిగా జరగలేదన్నాడు. డిజిటల్ ఇంటర్మీడియట్ దగ్గర తేడా జరగడం వల్ల విజువల్స్ అలా కనిపించాయన్నాడు. నైట్ ఎఫెక్ట్‌లో చాలా సీన్లు తీశామని అవి కూడా తెరపై సరిగా రాలేదని కాబట్టే సినిమా లుక్ తేడాగా అనిపించిందని అంతే తప్ప తామేమీ క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని అన్నాడు.