రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో

రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో విజయ్ అభిమాన సంఘం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసి సత్తా చాటింది. దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం (టీవీఎంఐ) అభ్యర్థులు తొమ్మిది జిల్లాల్లో గెలుపొందారు. దీంతో రాజకీయాల్లోకి ఇయక్కం గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిందని సభ్యులు తెలిపారు. నటుడు కమల్‌ హాసన్‌ నేతృత్వంలోని పార్టీ మక్కల్‌ నీది మయ్యం, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓటింగ్‌ శాతం పొందిన సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి చతికిలపడ్డాయి.

విజయ్‌ రాజకీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులకు స్థానిక ఎన్నికలు ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా కళ్లకురిచ్చి, విళ్లుపురం, కాంచీపురం జిల్లాల్లో టీవీఎంఐ సభ్యులు సత్తా చాటారు. ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఎన్‌.ఆనంద్‌ మాట్లాడుతూ… మొత్తం 169 మంది పోటీచేస్తే.. 121 మంది గెలిచారని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా తాను 9 జిల్లాల్లో పర్యటించానని, ఈ క్రమంలో ప్రజలు ఇయక్కం సభ్యులకు ఓటేస్తారన్న నమ్మకం కలిగిందని అన్నారు.

విళ్లుపురం జిల్లా వానూర్‌ పంచాయతీ యూనియన్‌లో టీవీఎంఐకి చెందిన సావిత్రి పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు ఆయన చెప్పారు. మహిళలు, యువత, విద్యార్థులు విజయ్‌పై గొప్ప అభిమానాన్ని చాటుతున్నారని ఆనంద్ పేర్కొన్నారు. అయితే, విజయ్‌కానీ, అభిమాన సంఘం కానీ బహిరంగంగా తమ అభ్యర్థులకు ఓటేయాలని ప్రచారం చేయలేదని గుర్తుచేశారు.

గత నెల చెన్నైలోని ఇయక్కం ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో సభ్యులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి అనుమతి లభించిందని తెలిపారు. త్వరలో జరుగనున్న తమిళనాడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆనంద్‌ స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని.. దళపతి విజయ్‌ ప్రచారం చేస్తే ఫలితాలు వేరేగా ఉండేవని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో అభ్యర్థుల గెలుపు విజయ్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది.

ఈ ఫలితాలపై మదురైకు చెందిన టీవీఎంఐ విభాగం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ ఆసక్తిగా మారింది. ‘మేము 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేశాం.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి పాలన అందిస్తాం’ అని ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. పెద్ద రాజకీయ పార్టీలు సైతం తక్కువ సీట్లే గెలుచుకున్నాయని, దళపతి ఎంట్రీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారనడానికి ఇది సంకేతమని బుస్సీ ఆనంద్ అన్నారు.