తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. ఇటీవలె విడుదలైన ఉప్పెన సినిమాతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. తాజాగా శ్రుతిహాసన్‌తో కలిసి లాభం అనే సినిమాలో నటించారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘ఉప్పెన మూవీ అనంతరం తమిళంలో ఓ ప్రాజెక్టు చేశాను. అందులో మొదట హీరోయిన్గా కృతిశెట్టి అయితే బావుంటుందని మూవీ టీం భావించారు. ఈ విషయం నాతో చెప్పగానే నేను ఈ సినిమా చేయను అని చెప్పాను. ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించి, ఇప్పుడు రొమాన్స్ చేయమంటే నేను చేయలేనని చెప్పా. ఉప్పెనలో కృతి శెట్టికి నేను తండ్రిగా నటించిన విషయం యూనిట్ సభ్యులకు తెలియదు.
అందుకే మొదట ఆమెను హీరోయిన్గా అనుకున్నారు. భవిష్యత్తులోనూ కృతిశెట్టితో సినిమా చేయను. ఉప్పెన చిత్రం క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడింది. దీంతో నాకు నీ అంత వయసున్న కొడుకు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. భయపడకు..ధైర్యంగా చెయ్ అని ప్రోత్సహించాను. కాబట్టి కూతురిలా భావించిన కృతిశెట్టితో జోడీలా నటించడం నా వల్ల కాదు’ అని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.