వివాదంలో ప్రముఖ హీరో సినిమా

వివాదంలో ప్రముఖ హీరో సినిమా

తమిళ హీరో విజయ్‌ సేతుపతికి ప్రత్యేక క్రేజ్‌ ఉంది. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు, సినిమాలతో తన అభిమానులను అలరిస్తుంటారు. ఇక ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. తాజాగా విజయ్‌ సేతుపతి శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలయిన మోషన్‌ పిక్చర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

ఇక మురళీధరన్‌గా విజయ్‌ సేతుపతి లుక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్‌ఆన్‌ విజయ్‌సేతుపతి అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివిక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌ పాత్రలో మీరు నటిస్తారా.. ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరి కొందరు మీరు చేసేది పూర్తిగా తప్పు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక మూవీ మేకర్స్‌ మాత్రం ఈ బయోపిక్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని.. నిజాల్ని నిర్భయంగా చూపిస్తామని ప్రకటించారు. ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలో కనిపించని అనేక కోణాలు తెర మీదకు వస్తాయని తెలుపుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.