రాజ్య‌స‌భలో ఆవిష్కృత‌మైన ర‌హ‌స్య బంధం

Vijaya Sai Reddy touches Modi Feet at Parliament

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ర‌హ‌స్య బంధం రాజ్య‌స‌భ సాక్షిగా వెలుగులోకి వ‌చ్చింది. కొత్త మిత్రులు ఒక‌రిపై ఒక‌రు ఎంత ప్రేమాభిమానాలు కురిపించుకుంటున్నారో క‌ళ్లారా చూసి పెద్ద‌ల స‌భ ఎంపీలు త‌రించారు. విశ్వాసం, అవిశ్వాసాల మ‌ధ్య లేశ‌మాత్ర‌మైనా లేని తేడా అన్ని పార్టీల క‌ళ్లూ తెరిపించింది. ఈ వివ‌ర‌ణ అంతా రాజ్య‌స‌భ‌లో మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న ఓ అద్వితీయ దృశ్యం గురించి. సాధార‌ణంగా… రాజ‌కీయాల్లో ప్ర‌భుత్వంపై ఏ కార‌ణం చేతైనా అవిశ్వాసం పెట్టే పార్టీ అధికార‌పక్షంపై నిత్యం క‌త్తులు దూస్తూ ఉంటుంది. ప్ర‌త్య‌ర్థి పార్టీని ఎండ‌గ‌ట్ట‌టానికి ఎక్క‌డ ఏ అవ‌కాశం దొరుకుతుందా అని కాచుక్కూర్చుంటుంది. అధికార‌పక్ష నేత‌లతో ఆమ‌డ‌దూరం పాటిస్తుంటుంది. స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లో అవిశ్వాసం పెట్టించుకున్న ప్ర‌భుత్వాలు, పెట్టిన ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఇన్నేళ్లుగా ఇదే ప‌రిస్థితి క‌న‌ప‌డింది. కానీ ఇప్పుడు మాత్రం కేంద్రంలోని బీజేపీ, ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ క‌లిసి… రాజ‌కీయాల‌కే కాకుండా… అవిశ్వాసం అన్న‌మాట‌కే కొత్త నిర్వ‌చ‌నం ఇచ్చాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ తో… చాలా రోజుల ముందునుంచే ఆర్భాటంగా ప్ర‌చారంచేసుకుని మ‌రీ వైసీపీ కేంద్రప్ర‌భుత్వంపై అవిశ్వాస‌తీర్మానానికి నోటీసులిచ్చింది. అవిశ్వాస‌తీర్మానం నోటీస‌యితే మొక్కుబ‌డిగా ఇచ్చారు గానీ… వైసీపీ ఎప్పుడూ బీజేపీపై అవిశ్వాసం ప్ర‌క‌టించ‌లేదు. తీర్మానం ప్ర‌వేశ‌పెట్టానికి ముందూ, త‌ర్వాతా కూడా వైసీపీ కేంద్ర‌ప్ర‌భుత్వంపైనా, ప్ర‌ధాని మోడీపైనా విశ్వాసం ఉన్న‌ట్టుగానే ప్ర‌వ‌ర్తించింది. అలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేసింది. ప్ర‌త్యేక హోదా కేంద్ర‌ప్ర‌భుత్వం ఇస్తుంద‌ని త‌మకు న‌మ్మ‌కం ఉంద‌ని వైసీపీ ఎంపీ విజ‌య్ సాయిరెడ్డి ప్ర‌క‌టించారు. మ‌రి అంత విశ్వాసం ఉంటే వైసీపీ అవిశ్వాసం ఎందుకు పెట్టిందో ఏ రాజ‌కీయ‌పార్టీకీ అర్దం కావ‌డం లేదు. దీంతో పాటు… చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఆరోపించిన‌ట్టు అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడిగా ఉన్న విజ‌య్ సాయిరెడ్డి… పీఎంవో కార్యాల‌యంలోనే మ‌కాం పెట్టారు. చంద్ర‌బాబు అవినీతిపై ఫిర్యాదుచేయ‌డానికే తాను పీఎంవో కార్యాల‌యానికి వెళ్తున్నాన‌ని విజ‌య్ సాయిరెడ్డి స‌మ‌ర్థించుకుంటున్నారు. పైకి ఏం చెబుతున్న‌ప్ప‌టికీ… బీజేపీ, వైసీపీని మిత్ర‌ప‌క్షాలుగా మార్చేందుకే విజ‌య్ సాయిరెడ్డి… పీఎంవో చట్టూ ప్ర‌దక్షిణ‌లు చేస్తున్నార‌న్న‌ది నిజం.

బీజేపీ, వైసీపీ మ‌ధ్య లోపాయికారీగా మిత్ర‌బంధం కుద‌రింద‌న‌డానికి… రెండు పార్టీలు బ‌హిరంగంగా ఇక క‌లిసిన‌డ‌వ‌డ‌మే త‌రువాయి అన‌డానికి రాజ్య‌స‌భ వేదిక‌యింది. ఈ ఉద‌యం ప్ర‌ధాని మోడీ రాజ్య‌స‌భ‌లోకి వ‌స్తున్న స‌మ‌యంలో ఎంపీలంద‌రూ న‌మస్కారం చేశారు. అయితే ప్ర‌ధాని మాత్రం బీజేపీ ఎంపీల‌తో పాటు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి మాత్ర‌మే ప్ర‌తి న‌మ‌స్కారం చేస్తూ త‌న స్థానంలో కూర్చున్నారు. అనంత‌రం విజ‌య సాయిరెడ్డి వెళ్లి ప్ర‌ధానికి పాదాభివంద‌నం చేశారు. మోడీ కూడా ఎంతో ఆప్యాయంగా ఆయ‌న్ని త‌ట్టి లేపి అభినందించారు. విజ‌య్ సాయిరెడ్డి ప్ర‌ధానికి ఎంత ద‌గ్గ‌ర‌య్యారో, బీజేపీ, వైసీపీ మిత్రబంధం ఎంత బ‌లంగా ఉందో ఈ స‌న్నివేశం రుజువుచేసింది. ఈ దృశ్యాన్ని క‌ళ్లారా చూసిన ఎంపీలంతా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. అవిస్వాస తీర్మానం పెట్టిన పార్టీకి చెందిన ఎంపీ… ప్ర‌ధాని కాళ్ల‌కు మొక్క‌డం… చూసి ఎంపీలంతా అనేక‌ర‌కాలుగా చ‌ర్చించుకున్నారు. నిజానికి అన్నాడీఎంకె, టీఆర్ ఎస్ పుణ్య‌మా అని వైసీపీతో పాటు టీడీపీ ఇచ్చిన అవిశ్వాస‌తీర్మానాలు చ‌ర్చ‌కు నోచుకోవ‌డం లేదు గానీ… లేక‌పోతే అవిశ్వాసం పెట్టిన పార్టీనే కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని వేన్నోళ్ల పొగిడే క‌మ‌నీయ దృశ్యానికి కూడా లోక్ స‌భ వేదికై రాజ‌కీయాల్లోని కొత్త సంస్కృతిని క‌ళ్ల‌కు క‌ట్టేది.