దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సమయంలో మరో వింత వార్త ప్రజలను భయభ్రాంతులకు గరిచేస్తుంది. తాజాగా గుంపులు గుంపులుగా గబ్బిలాలు మృత్యువాత పడటంతో ప్రజల్లో తీవ్ర కలకలం రేగుతోంది. కాగా తాజాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మీరట్ శివారు పల్లెలోని మెహ్రోలీలో నీటి గుంటలో ఏప్రిల్ 29న పదుల సంఖ్యలో గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వీటి నుంచే వ్యాపించిందని రకరకాల వార్తలు రావడంతో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారాన్ని చేరవేశారు.
అయితే ఆ సమాచారాన్ని అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గబ్బిలాల నమూనాలను బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)కి పంపించారు. వాటి మీద ఐవీఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి కరెంట్ షాక్ తగలడం వల్లే గబ్బిలాలు మరణించాయని తేల్చారు. కాగా దీనిపై అటవీ శాఖ అధికారి అదితి శర్మ మాట్లాడుతూ.. మొదటిగా పండ్ల తోటలలో వెదజల్లిన రసాయనాల వల్ల గబ్బిలాలు చనిపోయినట్లు భావించామని.. కానీ ఎలక్ట్రిక్ షాక్ వల్లే ఈ ఘటన జరిగింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. కానీ మెహ్రోలి గ్రామస్తులు మాత్రం ఆయన మాటలను ఖండిస్తూ గబ్బిలాల మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో ఎలాంటి కరెంట్ లైన్ లేదని గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ కరెంట్ షాక్ కారణంగానే అవి చనిపోతే.. అక్కడ ఉన్న మిగతా జంతువులు ఎందుకు చనిపోలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా పరిశీలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.