తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ఓ గర్భిణిని ఆంబులెన్స్ ఎక్కించేందుకు గ్రామస్తులు మూడు కిలోమీటర్లు మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కాసీపూర్ సమితిలోని బొడొఫసా గ్రామంలో చోటుచేసుకుంది. బొడొఫసా గ్రామానికి చెందిన బిబిన్ మజ్జి భార్య థాసాయికి ఆదివారం సాయంత్రం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.
భార్య ప్రసవవేదన పడుతుండటం గమనించిన భర్త బిబిన్ ఆంబులెన్స్కు సమాచారం అందించాడు. గ్రామానికి వస్తున్న ఆంబులెన్స్ సరైన దారిలేకపోవడంతో మూడు కిలోమాటర్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో గ్రామస్తుల సాయంతో గర్భిణిని మంచంపైనే మోస్తూ ఆంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో థాసాయి..పండంటి బిడ్డకి జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు.