Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ లో ఒకేసారి ప్రవేశించారు. అనేక రికార్డులూ సృష్టించారు. కానీ కాలక్రమేణా సచిన్ క్రికెట్లో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదగగా…వినోద్ కాంబ్లీ మాత్రం వెనుకబడిపోయాడు. అయినప్పటికీ సచిన్ -కాంబ్లీ స్నేహం మాత్రం అలానే కొనసాగింది. ఏళ్లు గడిచేకొద్దీ మాత్రం ఈ బంధం బీటలువారింది. తాను ఎదిగేక్రమంలో సచిన్ తనను పట్టించుకోలేదని ఒకానొక సందర్భంలో కాంబ్లీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఇది సచిన్ కు బాధ కలిగించడంతో కాంబ్లీకి దూరం జరిగాడు. తన రిటైర్మెంట్ వంటి కీలక సందర్భంలోనూ సచిన్ కాంబ్లీకి ఆహ్వానం పంపలేదు. ఇలా ఇద్దరి మధ్య కొన్నాళ్లు కొనసాగిన విభేదాలు గత ఏడాది సమసిపోయాయి.
కాంబ్లీ పుట్టినరోజు వేడుకలకు సచిన్ హాజరయ్యాడు. ఇద్దరి పాత స్నేహితుల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి ఫొటోలే నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో కాంబ్లీ సచిన్ పాదాలను తాకాడు. ఫొటో వివరాల్లోకి వెళ్తే…యువ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చేందుకు ఇటీవల ముంబై టీ 20 లీగ్ నిర్వహించింది. ఈ లీగ్ కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఈ లీగ్ ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ట్రయంప్ నైట్స్ ముంబయి నార్త్ ఈస్ట్ తో జరిగిన ఫైనల్లో శివాజీ పార్క్ లయన్స్ జట్టు మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. లయన్స్ జట్టుకు కాంబ్లీ కోచ్ గా వ్యవహరించాడు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా లయన్స్ జట్టుకు మెడల్స్ అందజేస్తున్నారు. కాంబ్లీ కూడా మెడల్ తీసుకునేందుకు వచ్చాడు. సచిన్ ను చూడగానే భావోద్వేగానికి గురైన కాంబ్లీ వెంటనే అతని కాళ్లకు నమస్కరించాడు. వెంటనే సచిన్ కాంబ్లీని పైకిలేపి గుండెలకు హత్తుకున్నాడు. సన్నీ చేతులమీదగా అందుకోవాల్సిన మెడల్ ను సైతం కాంబ్లి సచిన్ తోనే మెడలో వేయించుకుని స్నేహితునిపై తనకున్న అభిమానాన్ని తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
When two legendary friends from Mumbai cricket meet, there is respect all around!@sachin_rt @vinodkambli349 #CricketChaRaja pic.twitter.com/r8p5nOLtXF
— T20 Mumbai (@T20Mumbai) March 22, 2018