‘‘ఐపీఎల్-2021 రెండో అంచె మధ్యలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి టీమిండియా సారథి విరాట్ కోహ్లిని తొలగించనున్నారు. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించనున్నారు’’ అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజా సీజన్ తొలి దశలో మెరుగైన స్థితిలో నిలిచిన ఆర్సీబీ.. రెండో అంచెలోని తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవటమే ఇందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి(5 పరుగులు) పూర్తిగా విఫలం కావటం వల్లే ఫ్రాంఛైజీ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుందనేది వాటి సారాంశం. అయితే, వాటిలో వాస్తవమెంత?
నిజానికి, ఈ సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగుతానని కోహ్లి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందే.. ఐసీసీ మేజర్ ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ సారథ్యానికి గుడ్‌బై చెబుతానని అతడు వెల్లడించాడు. ఈ క్రమంలో.. ఒత్తిడి తగ్గించుకుని బ్యాటర్‌గా రాణించేందుకే కోహ్లి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
2013 సీజన్ నుంచి పూర్తి స్థాయిలో ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన కోహ్లి.. ఇంతవరకు టైటిల్ నెగ్గలేదన్న సంగతి తెలిసిందే. అంతేగాక, ఐపీఎల్ చరిత్రలోనే ఇంత వరకు ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లలో బెంగళూరు కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించి.. గౌరవప్రదంగా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాలని కోహ్లి భావించడం సహజం. అయితే, రెండో అంచె తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుకావడం, అందునా కోహ్లి 5 పరుగులకే నిష్క్రమించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్‌కింగ్స్‌తో సెప్టెంబరు 24న జరిగే మ్యాచ్ నుంచే కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. టీమిండియా మాజీ ఆటగాడు ఒకరు ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ వివరాల ప్రకారం.. దినేశ్ కార్తిక్(కేకేఆర్), డేవిడ్ వార్నర్(ఎస్‌ఆర్‌హెచ్) మాదిరే కోహ్లికి అదే గతి పడుతుందని అతడు వ్యాఖ్యానించాడు.
నిజంగానే ఆర్సీబీ కోహ్లి పట్ల అంత అవమానకరంగా వ్యవహరించే అవకాశం ఉందా అంటే.. ‘కాదు’ అనేదే మెజారిటీ మంది క్రీడా విశ్లేషకుల మాట. ఎందుకంటే… ఆర్సీబీకి ఉన్న ప్రధాన ఆటగాడు అంటే కోహ్లినే. ఇంతవరకు ఒక్క టైటిల్ గెలవకపోయినా.. ఆ జట్టుకు అంత మంది అభిమానులు ఉన్నారంటే.. అందుకు కూడా కోహ్లి ఇమేజ్, బ్రాండింగ్ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా కెప్టెన్‌గా.. పరుగుల యంత్రంగా అతడికి ఉన్న క్రేజ్ వల్లే ఆర్సీబీకి ఈస్థాయిలో ఫ్యాన్ బేస్ ఉందనేది కాదనలేని వాస్తవం.
నిజానికి కోహ్లినే ఈ సీజన్ తర్వాత తప్పుకొంటానని, ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని స్వయంగా ప్రకటించాడు. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని అర్ధంతరంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తే.. కోహ్లికి జరిగే నష్టం కంటే కూడా ఆర్సీబీకి వాటిల్లే నష్టమే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కోహ్లి తనంట తానుగా తప్పుకొంటే మరో స్టార్ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ బెంగళూరు పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.