ఒకానొక సమయంలో తాను తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించారు. ప్రపంచంలో తానొక్కడే ఒంటరి వాడినని ఫీలైనట్లు తెలిపాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ నిర్వహించిన ‘నాట్ జస్ట్ క్రికెటర్’ పాడ్‌కాస్ట్‌లో భాగంగా కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వెల్లడించాడు.
పాడ్‌కాస్ట్ సందర్భంగా నికోలస్, కోహ్లిని ఉద్దేశించి ‘‘మీ కెరీర్‌లో డిప్రెషన్‌కు గురైన సందర్భాలు ఏవైనా ఉన్నాయా’’ అని అడిగాడు. అందుకు బదులుగా కోహ్లి ‘‘అవును.. నేనూ ఒత్తిడికి గురయ్యా. పరుగులు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం అనే బాధతో రోజు ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే దాదాపు చాలా మంది బ్యాట్స్‌మెన్ తమ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పరిస్థితి అనుభవించి ఉంటారు.
ఆ సమయంలో మనం దేన్ని కంట్రోల్ చేయలేం. దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. ఇంగ్లాండ్ టూర్లో నేను ఇలాంటి పరిస్థితి అనుభవించా. ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినేమో అనిపించింది. నేనేం చేయలేకపోతున్నాననే బాధ నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యాను’’ అన్నాడు కోహ్లి.
‘‘ఆ సమయంలో వృత్తి పరమైన నిపుణుడు మనతో పాటు ఉంటే బాగుండు అనిపించింది. అంత మందితో కలిసి ఉన్నప్పటికి నేను ఒంటరిగానే ఫీలయ్యేవాడిని. అయితే దీని గురించి ఎవరికి చెప్పలేదు. నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నానో వివరించేందుకు ఓ నిపుణుడితో మాట్లాడటం అవసరం అనిపించింది.
కానీ ఆ సమయంలో ఎవరు లేరు. అప్పుడనిపించింది జీవితంలో ప్రతి దశలో మనకు ప్రొఫేషనల్ అవసరం ఉంటుంది అని. మనం ఎలా ఉన్నాం.. దేని గురించి ఆలోచిస్తున్నాం… దేని వల్ల మనం సరిగా నిద్ర పోలేకపోతున్నాం.. లేవలేక పోతున్నాం.. మన మీద మనకు నమ్మకం లేదు.. ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి.. మనం చెప్పేది వినడానికి ప్రొఫేషనల్ అవసరం ఎంతో ఉంది అనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ పరిస్థితుల నుంచి బయటపడగలిగాను’’ అన్నాడు కోహ్లి.
2014 ఇంగ్లాండ్ టూర్లో విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టులు ఆడి వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0,7, 6, 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మళ్లీ ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఫామ్‌లోకి వచ్చాడు.