‘మేము ఏదైతే అనుకున్నామో అది సాధించాం.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామంటూ’ ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పెద్ద మొత్తంలో వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్(రూ. 14.25 కోట్లు), న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమిసన్(రూ. 15 కోట్లు)తో పాటు డేనియల్ క్రిస్టియన్, కేన్ రిచర్డ్సన్తో పాటు కెఎస్ భరత్, సచిన్ బేబి, రజత్ పాటిధార్, మహ్మద్ అజారుద్దీన్, సుయేశ్ ప్రభుదేశాయ్, లాంటి స్వదేశీ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి అభిమానులనుద్దేశించి మాట్లాడిన వీడియోనూ ఆర్సీబీ తన ట్విటర్లో షేర్ చేసింది.
‘వేలంలో ఆటగాళ్ల కొనుగోలుపై సంతోషంగా ఉన్నా. వేలం సందర్భంగా వచ్చిన ఫలితంతో సంతృప్తిగా ఉంది. 11 మందిని వదిలేసుకున్న తర్వాత మా జట్టు కాస్త బలహీనంగా తయారైంది. వాటిని పూడ్చేందుకు వచ్చిన అవకాశాన్ని సరైన సమయంలో ఉపయోగించుకున్నాం.
మ్యాక్స్వెల్, జేమిసన్, డేనియల్ క్రిస్టియన్ లాంటి ఆటగాళ్లు జట్టులో చేరడం మాకు అదనపు బలం. కొత్తగా చేరిన ఆటగాళ్లతో సమన్వయంగా ఉంటూ కొత్త దారిలో వెళ్లనున్నాం. ఇప్పుడు జట్టు సమతూకంగా ఉండడంతో రానున్న ఐపీఎల్ సీజన్లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతాం. అంతేగాక ఫ్యాన్స్ మాకు పెద్ద బలం.. మీ మద్దతు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.’అని తెలిపాడు.
కాగా ప్రతీ సీజన్లోనూ మంచి అంచనాలతో బరిలోకి దిగే ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేకపోయింది. ఇప్పటివరకు 13 ఐపీఎల్ సీజన్లు జరగ్గా.. 2009, 2011,2016ల్లో ఫైనల్కు చేరడమే వారి ఉత్తమ ప్రదర్శనగా చెప్పుకొవచ్చు. మ్యాక్స్వెల్, జేమిసన్, డేనియల్ క్రిస్టియన్ రాకతో మరింత బలంగా కనిపిస్తున్న ఆర్సీబీ ఈసారైనా టైటిల్ సాధిస్తుందేమో చూడాలి.