ఐపీఎల్-2021 సెకండ్ ఫేస్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన మైలురాయిని క్రాస్ చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ ఇతర భారత బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యం కాని 10000 పరుగుల మైలరాయిని దాటేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి బంతికి సింగల్ తీయడం ద్వారా ఓవరాల్ టీ20 కెరీర్‌లో పది వేల పరుగులను పూర్తి చేశాడు. భారత జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున మొత్తం 314 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 133కు పైగా స్ట్రైక్ రేట్‌తో 10000 పరుగులను పూర్తి చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుతం పొట్టి క్రికెట్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 447 మ్యాచ్‌ల్లో 14,273 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 22 సెంచరీలు, 87 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతను 564 మ్యాచ్‌ల్లో సెంచరీ, 56 హాఫ్ సెంచరీల సాయంతో 11 వేల పైచిలుకు పరుగులు సాధించాడు. వీరి తర్వాత పాక్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ మూడో స్థానంలో ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు.