దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు.. ఆర్‌సీబీ విధ్వంసకర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా శుక్రవారం ట్విటర్‌లో ప్రకటించాడు. డివిలియర్స్ నిర్ణయంపై ఆర్‌సీబీ సహచర ఆటగాడు.. చిరకాల మిత్రుడు విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు.
”ఏబీ డివిలియర్స్.. నీ నిర్ణయం నా గుండెను ముక్కలు చేసింది. కానీ సరైన సమయంలోనే ఆటకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇక మా కాలంలో నువ్వొక అత్యుత్తమ ఆటగాడివి. నేను కలుసుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి. ఆర్‌సీబీకి నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.. అంతేకాదు దానిని గొప్ప గౌరవంగా భావిస్తున్నా.
ఆటకు గుడ్‌బై చెప్పినప్పటికి మన బంధం బయట కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. చివరగా ఐ లవ్ యూ డివిలియర్స్.” అంటూ ముగించాడు. కాగా కోహ్లి ట్వీట్‌పై స్పందించిన ఏబీ.. ”లవ్ యూ టూ బ్రదర్” అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.
2011లో ఆర్‌సీబీలోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. కోహ్లితో కలిసి ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇద్దరు కలిసి ఎన్నో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును గెలిపించారు. ఐపీఎల్‌లో 5వేలకు పైగా పరుగులు చేసిన డివిలియర్స్ విదేశీ ఆటగాళ్లలో అత్యంత సక్సెస్ అయిన ఆటగాడిగా నిలిచాడు.ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 184 మ్యాచ్‌లాడిన ఏబీ 5162 పరుగులు చేశాడు.