టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత కొద్ది కాలంగా అంత ఫామ్‌లో లేడు. అతడు తన ఇన్నింగ్స్‌లను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులోనే కేవలం 45 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు దాటింది. నవంబరు 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్-బాల్ టెస్ట్‌లో కోహ్లి తన చివరి సెంచరీ సాధించాడు.
ఈ క్రమంలో కోహ్లి ఫామ్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి తన ఇన్నింగ్స్‌లను పెద్ద స్కోర్లుగా మార్చడంలో విఫలమవడం ఎక్కువ రోజులు కొనసాగదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లి ఒక క్లాస్ ప్లేయర్. నా అభిప్రాయం ప్రకారం.. అతడి ప్రస్తుత ఫామ్‌లేమి ఎక్కువ కాలం కొనసాగదు. అతడు మళ్లీ తన మునపటి ఫామ్‌ను అందుకుంటాడు. ప్రతీ ఒక్క ఆటగాడు తన కెరీర్‌లో ఏదో ఒక సమయాన గడ్డు పరిస్ధితులు ఎదుర్కోవలిసి వస్తుంది.
కోహ్లి కూడా అంతే.. ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నాడు. ఇదేమి శాశ్వతం కాదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడని అంతా భావించారు. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో కోహ్లి ఆ ఘనత సాధించడం చాలా కష్టం. అతడు చాలా సార్లు 40 నుంచి 50 పరుగులలోపు ఔటయ్యాడు. అతడు తన బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎటువంటి మార్పులు చేయవలసిన అవసరం లేదు. కొంచెం ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తే చాలు’ అని చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.