భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లిను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో 100వ టెస్ట్ ఆడనున్న కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ.. టెస్ట్‌ల్లో టీమిండియా ఈ పరిస్ధితికి కోహ్లినే కారణమంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లి టెస్ట్ సారధ్య బాధ్యతలు చేపట్టే నాటికి టీమిండియా ఏడో ర్యాంకులో ఉందని, అలాంటి జట్టును కోహ్లి వరుసగా ఐదేళ్లు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిపాడని కొనియాడాడు.
టెస్ట్ క్రికెట్లో కోహ్లి ఓ స్పెషల్ ప్లేయర్ అని, అలాంటి ఆటగాడి వందో టెస్ట్‌ను అంతకంటే స్పెషల్‌గా చేయాలని అనుకుంటున్నామని అన్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లి చిరస్మరణీయ విజయాలు సాధించాడని, 2018లో అతని సారధ్యంలో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ విజయం చాలా ప్రత్యేకమని తెలిపాడు. 2013లో దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్‌పై కోహ్లి చేసిన క్లాసీ టెస్ట్ సెంచరీలను నాతో పాటు ప్రతి క్రికెట్ అభిమాని చిరకాలం గుర్తించుకుంటాడని పేర్కొన్నాడు.
అలాగే పెర్త్‌లో కోహ్లి ఇన్నింగ్స్ వేరే లెవెల్ అని కొనియాడాడు. టీమిండియా సాధించిన విజయాలు, సాధించబోయే విజయాల్లో కోహ్లికి కచ్ఛితంగా క్రెడిట్ దక్కుతుందని చెప్పుకొచ్చాడు. తొలి టెస్ట్ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన రోహిత్.. కోహ్లిపై ఇలా ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా శ్రీలంకతో రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండగా.. కోహ్లి కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు.