భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. తిరిగి అట్టిపెట్టుకునే విధానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 17 కోట్లు చెల్లించి కోహ్లీని సొంతం చేసుకుంది. కోహ్లీ ధర రూ. 15 కోట్లు ఉండగా…రాయల్ ఛాలెంజర్స్ మరో రూ.2కోట్లు అదనంగా చెల్లిస్తోంది. ఐపీఎల్ లో ఒక్క ఆటగాడికి ఫ్రాంఛైజీలు ఇంత మొత్తం ఖర్చు చేయడం ఇదే తొలిసారి.
2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ ను రూ. 16 కోట్లకు వేలంలో పాడుకుంది. 2018 ఐపీఎల్ కోసం అట్టిపెట్టుకునే విధానంలో రూ. 17 కోట్లతో విరాట్ కోహ్లీ తొలిస్థానంలో ఉండగా… రూ. 15 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మహేంద్రసింగ్ ధోనీ, ముంబై ఇండియన్స్ తరపున రూ. 15 కోట్లతో రోహిత్ శర్మ, తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే రూ. 12 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ స్టీవ్ స్మిత్ ను, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 12 కోట్లతో డేవిడ్ వార్నర్ ను అట్టిపెట్టుకుంటున్నాయి.
మొత్తానికి ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు వెచ్చిస్తోన్న ఈ ధరలు చూస్తోంటే..పదేళ్ల తర్వాత కూడా ఐపీఎల్ కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు సరికదా…మరింత పెరిగిందనిపిస్తోంది. ఐపీఎల్ మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ..ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ద్వారా ఎందరో స్వదేశీ, విదేశీ క్రికెటర్లు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ముఖ్యంగా భారత యువ ఆటగాళ్లకు ఐపీఎల్ వరప్రయదాయనిలా మారింది. ఐపీఎల్ లో రాణించడం ద్వారా చాలా మంది క్రికెటర్లు ఆర్థిక కష్టాలను అధిగమించడంతో పాటు సెలక్టర్ల దృష్టిలో పడి జాతీయ జట్టులో చోటు సైతం దక్కించుకుంటున్నారు.